POLYCET: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచిపోయినా నేటికీ విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో పర్యవేక్షణ కరువై అధికారుల్లో తీవ్ర అలసత్వం పెరిగిందని, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విద్యాసంవత్సరపు పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారిందని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మేకల అక్షయ్ కుమార్ మండిపడ్డారు. దరఖాస్తుల స్వీకరణ తేదీ నుంచి మొదలు, కౌన్సిలింగ్, సీట్ అలాట్మెంట్ తేదీల షెడ్యూల్ ప్రకటనల వరకూ అధికారులు నిర్లక్షంగానే వ్యవహరించారని, షెడ్యూల్ ప్రకారం ఈనెల నాలుగో తేదీలోపే జరగాల్సిన పాలిసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపులు ఇంకా జరగలేదన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు సంబంధించిన డేటా ఎరేజ్ అయ్యిందన్న వార్తలపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఆదివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికై జరుగుతున్న పాలిసెట్ – 2025 కౌన్సిలింగ్ ప్రక్రియలో మొదటి విడత అడ్మిషన్ల కేటాయింపు సీట్ అలాట్మెంట్ షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన, అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. మరోవైపు పాలిసెట్ డేటా ఎరేజ్ అయిందని వస్తున్న వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
విద్యాశాఖను తనవద్దే ఉంచుకుని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపట్ల తక్షణమే స్పందించి పాలిసెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తిచేయించేందుకు కృషిచేయాలని అక్షయ్ ప్రకటనలో కోరారు. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆలస్యానికి కారణమని వస్తున్న “డేటా ఎరేజ్?” వార్తలు నిజమైతే సంబంధిత సాంకేతిక విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సంధర్భంగా ఆయన డిమాండ్ చేశారు.