Plane Crash: వరస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా, మొన్న బంగ్లాదేశ్ ఘోర విమాన ప్రమాదాలు చేసిన గాయాలింకా మానక ముందే రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 43 మంది ప్రయాణికులు మరియు 6 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్యాసింజర్ విమానం చైనా సరిహద్దు సమీపంలోని అముర్ ప్రాంతంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానం టిండా నగరానికి బయలుదేరి, గమ్యస్థానానికి చేరువలో ఉండగా ఈ ఘటన జరిగింది.
విమానానికి సంబంధించిన వివరాల ప్రకారం, చైనా బోర్డర్‌కు సమీపంలోకి వెళ్లగానే విమానం ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోయింది. టిండా చేరడానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. ఇది గుర్తించిన అధికార యంత్రాంగం వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టింది.
15 కిలోమీటర్ల దూరంలో మంటలు ఎగిసి పడుతున్న ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
వాతావరణం అనుకూలించకే..
విమానం ల్యాండింగ్ చేస్తుండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మొదటి ప్రయత్నం విఫలమైంది. రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నంలో రాడార్ నుంచి అదృశ్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విమానంలో ఉన్న 49 మంది ప్రయాణికుల్లో 5 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటికీ ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారన్న సమాచారం అధికారికంగా వెలుబడాల్సి ఉంది. ఘటనా స్థలంలో భారీగా మంటలు వ్యాపించడంతో సహాయక చర్యలకు కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదం వెనుక యేదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది. రష్యన్ విమానయాన చరిత్రలో ఇది మరో విషాద ఘటనగా నమోదయ్యింది.