Petrol: పెట్రోల్ ధరలు మన రోజువారీ జీవితానికి ఎంతో కీలకం. మనం రోజు మార్నింగ్ న్యూస్, టీవీ చానెల్స్, మొబైల్ అప్లికేషన్స్ చూసే విషయంలో మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్ ధరల తాజా సమాచారం. ఒక్క లీటర్ పెట్రోల్ ధర ఎంత? మరుసటి రోజున పెరుగుతుందా.. తగ్గుతుందా? అనే ఉత్కంఠ ప్రతి కుటుంబాన్ని వెంటాడుతోంది. అయితే అసలు పెట్రోల్ ధరలు ఎలా నిర్ణయించబడతాయి? ఎవరు ఈ ధరలను డిసైడ్ చేస్తారు? మనం చెల్లించే ధర నిజంగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం.
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు ధరలు పెట్రోల్ ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రపంచంలో ఎక్కువ చమురు ఉత్పత్తి చేసే దేశాల సమాహారాన్ని OPEC (Organization of the Petroleum Exporting Countries) అని పిలుస్తారు. ఈ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, UAE వంటి దేశాలు ముడి చమురు ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ప్రపంచ చమురు ధరలను ప్రభావితం చేస్తుంటాయి. OPEC ఉత్పత్తి తగ్గిస్తే చమురు కొరత పెరిగి ధరలు ఎగబాకుతాయి. అదే ఉత్పత్తి పెంచితే ధరలు పడిపోతుంటాయి. ఇక్కడే పెట్రోల్ ధరల గేమ్ మొదలవుతుంది.
భారత్ ముడి చమురు దిగుమతి ఎక్కువ..
మన దేశం ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్‌లో ముడి చమురు దాదాపు 85 శాతం విదేశాల నుంచే వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు బ్యారెల్ ధర పెరగడం, డాలర్ – రూపాయి మారకపు నిష్పత్తి మారడం, దిగుమతి ధరలు పెరగడం వలన దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలపై దెబ్బ పడుతుంది.

ఏ ప్రభుత్వమెంత..?
ఇంకా, మన దేశంలో పెట్రోల్ ధరపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ (VAT), ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. నిజానికి ముడి చమురు ధర లీటర్‌కు 40 నుండి 50 రూపాయల మధ్యే ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ పన్ను, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్, డీలర్ మార్జిన్, రవాణా ఖర్చులు కలిసే మనకు లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు చేరుతుంది.
ఉదాహరణకు, ముడి చమురు ధర 50 రూపాయలైతే, కేంద్ర ప్రభుత్వం దాదాపు 20 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీగా వసూలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 15-20 రూపాయల వరకు వ్యాట్ విధిస్తుంది. పైగా డీలర్ మార్జిన్, రవాణా ఖర్చులు కలిపి చివరికి మనం చెల్లించేది 100 రూపాయలకు పైగా అవుతుంది.
అంతే కాదు, అంతర్జాతీయంగా అమెరికా, చైనా వంటి దేశాలు చమురు నిల్వలు ఎలా నిర్వహిస్తున్నాయి, యుద్ధ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సమయంలో పెట్రోల్ ధరలు ఎలా పెరిగిపోయాయో మనం చూసే ఉన్నాం.
2017 నుంచి రోజూ మార్పు..
మన దేశంలో 2017 తరువాత రోజూ పెట్రోల్ ధరలు మారే విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అంతకు ముందు వారం లేదా పదిహేను రోజులకు ఒకసారి ధరలు మారేవి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి, డాలర్ రేటును బట్టి ధరలు ప్రతి రోజూ అప్‌డేట్ అవుతున్నాయి.
కాబట్టి మనం చెల్లించే పెట్రోల్ ధర వెనుక చాలా పెద్ద అంతర్జాతీయ గణితమే ఉంది. ఒక్కరే నిర్ణయించే విషయం కాదు. ముడి చమురు ఉత్పత్తి దేశాలు, డాలర్ మారకపు విలువ, కేంద్ర, రాష్ట్ర పన్నులు, అంతర్జాతీయ యుద్ధాలు, దిగుమతి ఖర్చులు – ఇవన్నీ కలిపి మనం ప్రతిరోజూ పెట్రోల్ పంపులో చూస్తున్న ధరను నిర్ణయిస్తాయి.
మరి ఒక్కసారి పెట్రోల్ ధర పెరిగితే అది మళ్లీ తక్కువ అయ్యే అవకాశాలు చాలా అరుదు. ఎందుకంటే పన్నులు తగ్గించడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపించవు. అందుకే పెట్రోల్ ధరల గేమ్ ఎప్పుడూ ప్రజల జేబును కొంచెం ఖాళీ చేయడానికే ఎక్కువగా మారుతుంది.