Amaravathi: ధర్మయుద్ధంలో అమరావతి, రైతులు గెలిచారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. దివిసీమ తుఫానులా వైకాపా అమరావతిని తుడిచేసిందన్నారు. అమరావతి పునఃప్రారంభ సభలో మాట్లాడిన ఆయన.. గతంలో తాను రైతులను కలిసినప్పుడు తమ కన్నీళ్లు తుడిచేదెవరని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అమరావతి ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్ అని.. దేశానికి తలమానికంగా దీన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. దేశమే తన కుటుంబంగా మోదీ(Modi) భావిస్తున్నారని కొనియాడారు. అమరావతి పునఃప్రారంభ సభకు వచ్చి, ఏపీ ప్రభుత్వానికి అన్నింట్లో అండగా నిలబడుతున్న మోదీకి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

అమరావతిని నామరూపాల్లా లేకుండా చేయాలని జగన్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేసిందని.. కానీ, తుఫానును తట్టుకొని ధైర్యంగా ఇక్కడి రైతులు, ఈ రాజధాని నిలబడ్డాయన్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదని దేశం మొత్తం గర్వపడేలా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్డీఏ సర్కారు ఉండటం వల్లనే శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని.. భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్‌లకు వలస వెళ్లే అవసరమే ఉండదని చెప్పుకొచ్చారు. అందరం కోరుకున్నట్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. భవానీ మాత ఆశిస్సులతో మోదీ మరింత శక్తిమంతులవ్వాలని పవన్ ఆకాంక్షించారు.