
Srikakulam: సినిమా థియేటర్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కనిపిస్తే కొత్తేముంది అనుకుంటున్నారా..? అవును, కొత్తే.. ఈసారి వెండితెరపై కనిపించింది ఏదో సినిమాలో హీరో(Hero)గా కాదు. ప్రజా నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister)గా. కూటమి సర్కారు ఏర్పడిన నాటి నుంచి వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు పవన్. ఆంధ్రా పల్లెల్లో మారిన గతుకుల రోడ్ల చిత్రాల నుంచి భరోసానిండిన మన్యం ప్రజల బతుకు చిత్రాల దాకా.. అన్నింట్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన సినిమాలో చెప్పే “నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను” అనే డైలాగ్‌ను సైతం ఇప్పుడు రాజకీయాల్లో అనువయిస్తున్నారు పవన్.
సినిమాల కోసం థియేటర్లకు వచ్చే జనాన్ని ఇప్పుడు తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చేలా చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ థియేటర్(Cinema Theatre) స్క్రీన్‌లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ‘మన ఊరు – మాటా మంతి‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. గురువారం శ్రీకాకుళం(Srikakulam) జిల్లా టెక్కలిలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. పవన్ నేరుగా అక్కడి ప్రజలతో లైవ్‌లో మాట్లాడనున్నారు. సమస్యలు తెలుసుకుని.. అధికారులనూ అక్కడి నుంచే ఆదేశించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారానే అన్ని ప్రాంతాల ప్రజలతో నేరుగా ముచ్చటించనున్నారు.
కేవలం ప్రభుత్వ అధికారులతో మాత్రమే ఇప్పటివరకూ సీఎం(CM), డిప్యూటీ సీఎం(Deputy CM), మంత్రులు(Ministers) లైవ్ కాన్ఫరెన్సులు నిర్వహించగా.. తొలిసారి పవన్ కళ్యాణ్ నేరుగా పెద్ద ఎత్తున జనంతో ఒకేసారి మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. ఒకేసారి ఎక్కువ మంది జనంతో మాట్లాడేందుకు సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కష్టమనే ఆలోచన నుంచి థియేటర్ ను తెర మీదికి తెచ్చారు పవన్. తనను నిలబెట్టిన వెండితెరనే.. ఇప్పుడు ప్రజల కోసం పవన్ వాడటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.