Tamil Nadu: ధర్మాన్ని అర్థం చేసుకోకుండా ప్రశ్నలు వేయకూడదని.. దుష్ట శక్తులను అంతం చేయడం, ప్రతీ ఒక్కరినీ సమానంగా చూడటమే దాని లక్షణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తమిళనాడు మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మురుగన్ భక్తులతో నిండిన ఈ మహాసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ధర్మం అంటే ఏమిటి? దుష్ట శక్తులను తొలగించడం, ప్రతివారినీ సమానంగా చూడడం, దుష్టులను శిక్షించడం ధర్మమని పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరించారు. ధర్మాన్ని అర్థం చేసుకోకుండా ప్రశ్నలు వేయడం సరి కాదన్నారు.
తమిళనాడు మురుగన్ సభను ఎందుకు నిర్వహిస్తున్నావు? ఇలాంటివి గుజరాత్ లో లేదా ఉత్తరప్రదేశ్ లో ఎందుకు చేయటం లేదు? అక్కడే చేసుకోవచ్చు కదా అని కొంతమంది రాజకీయ నాయకులు అడుగుతున్నారని.. ఇది విభజన ఆలోచన అని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వారు రేపు శివునిపై కూడా ప్రశ్నలు వేస్తారు. అమ్మవారిపై కూడా ప్రశ్నలు వేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన దృష్టికోణమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తమిళనాడులో ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
విభూతి పెట్టుకుని బడికి..
తాను పదహారేళ్ళ వయసులోనే శబరిమల వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, థైపూసం సందర్భంగా తిరుత్తణి వద్ద భక్తుల రద్దీ చూసి ఆశ్చర్యపోయానని పవన్ తెలిపారు. తాను చిన్నప్పుడు స్కూల్‌కి విభూతి పెట్టుకుని వెళ్లేవాడినని చెప్పారు. భారతదేశం మత స్వేచ్ఛ కలిగి ఉన్న దేశమని గుర్తు చేస్తూ, ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం తన మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం ఎందుకు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హిందూ మతాన్ని, హిందూ దేవతలను చిన్నచూపు చూడడం సెక్యులరిజం కాదని, అది సూడో సెక్యులరిజం అని తేల్చేశారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తాను 2014లో హైదరాబాద్‌లో జనసేన పార్టీని స్థాపించానని, కానీ తాను తమిళనాడులో పెరిగిన వాడినని చెప్పారు. తాను తమిళ సంస్కృతిని దగ్గర నుండి తెలుసుకున్న వాడినని, మధురై వంటి ప్రాచీన నగరంలో మాట్లాడటం తన జీవితంలో గర్వకారణమని పవన్ వివరించారు. మధురై నగరం ఏథెన్స్ కంటే కూడా ప్రాచీనమని పవన్ స్పష్టం చేశారు. ఇక్కడ ఇన్ని లక్షల మందితో, హిందూ సాధువుల మధ్య మాట్లాడడం తన జీవితంలో గొప్ప ఘట్టంగా భావిస్తున్నానని చెప్పారు.
మురుగన్‌ను నమ్మితే గెలుపే..
మురుగన్‌ను నమ్మితే విజయం ఖచ్చితం, ఎదుగుదల సుసాధ్యం, శక్తి లభిస్తుంది అని పవన్ పేర్కొన్నారు. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుందని, మన జీవితాన్ని మధురంగా మార్చుతుందని వివరించారు. ఎలుకలు ఎంత ఉన్నా, ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే అవి పరుగు తీస్తాయి. మన శత్రువులు ఎంత ఉన్నా, మురుగన్ తండ్రి శివుడి మెడలో ఉన్న నాగుని చూస్తే పారిపోతారు. కాబట్టి మార్పు ఖచ్చితంగా వస్తుందని పవన్ ధీమాగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ మహాకవి భారతీయర్ మాటలను కూడా సభలో ప్రస్తావించారు. “అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బదు ఇల్లయే” అనే మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయని చెప్పారు. మార్పు కోసం ధైర్యం అవసరం. కష్టాలను ఆపేస్తే కాలం ఆగదు. కొందరి కుత్సిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు. ఆ ధర్మం నడుస్తూనే ఉంటుందని పవన్ చెప్పారు.
మురుగన్ ప్రపంచపు తొలి విప్లవ నాయకుడని పవన్ తెలిపారు. మురుగన్‌కు బేధభావం ఉండదని, అందరినీ సమానంగా చూస్తారని వివరించారు. మధురైలో పార్వతి దేవి స్వరూపమైన మీనాక్షి అమ్మవారు, శివుడు సుందరేశ్వరుని రూపంలో కొలువై ఉన్నారని చెప్పారు. వారి కుమారుడు కార్తికేయుడు (మురుగన్) కూడా మధురైలో కొలువై ఉన్నారని గుర్తు చేశారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో మొదటిది, ఆరవది ఈ ప్రాంతంలోనే ఉన్నాయని వివరించారు.

మధురై దోపిడీకి గురైంది..
మధురై చరిత్రపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణమని, మధురై అంటే దేవతల పవిత్ర స్థలం అని చెప్పారు. కానీ ఒక సమయంలో మధురై ధ్వంసమైందని, 14వ శతాబ్దం ప్రారంభంలో మాలిక్ కఫూర్ మధురైను దోచుకున్నాడని పవన్ గుర్తు చేశారు. ఆ తర్వాత దాదాపు 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడిందని, అక్కడ పూజలు జరగలేదు అని వివరించారు. ఆ చీకటి కాలం తర్వాత మధురైలో మళ్లీ వెలుతురు వచ్చింది. ఆ వెలుతురును వెలిగించినవాడు విజయనగర యువరాజు కుమార కంబణన్ అని పవన్ వివరించారు.
మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించలేరని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. మన సంప్రదాయం బలమైనది. ధర్మం లోతుగా ఉంది. అది నడుస్తూనే ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సభకు లక్షల మంది మురుగన్ భక్తులు రావడంతో తమిళనాడులో అతిపెద్ద సభగా రికార్డు సృష్టించింది. బీజేపీ తమిళనాడు నేతలు అన్నామలై, నాయర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.