Pashamylaram: ఘోరం.. డీఎన్ఏ ప‌రీక్ష‌ల‌కు 67 శరీర భాగాలు!

Pashamylaram sigachi blast

Share this article

Pashamylaram, July 8: తెలంగాణ రాష్ట్రంలోని పాశ‌మైలారం పారిశ్రామికవాడ‌లో సిగాచి (Sigachi) ప‌రిశ్ర‌మ ప్ర‌మాదం యావ‌త్ దేశాన్ని క‌దిలించింది. ప‌రిశ్ర‌మ‌లో సంభవించిన రియాక్ట‌ర్ పేలుడుతో బీతావ‌హ ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ర‌ణాల‌పై అధికారికంగా స్ప‌ష్ట‌త రాలేదు. ప‌రిశ్ర‌మ భ‌వ‌నం శిథిలాల కింద ఇంకా కొన్ని శ‌రీర భాగాలు దొరుకుతూనే ఉన్నాయి.. ఆసుప‌త్రుల్లో చికిత్స‌కు చేరిన ఒక్కొక్క‌రూ రాలిపోతున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 10గంట‌ల వ‌ర‌కు మొత్తం 44 మంది మృతి చెందిన‌ట్లు అధికారికంగా తేలింది. అయితే, ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కూ గుర్తు తెలియ‌ని 67 శ‌రీర భాగాలను శాంపిళ్ల‌ను డీఎన్ఏ ప‌రీక్ష‌ల‌కు పంపినట్లు స‌మాచారం. మ‌రికొన్ని శ‌రీరాలు డీఎన్ఏ ప‌రీక్ష పూర్త‌యినా.. కుటుంబ స‌భ్యుల డీఎన్ఏ(DNA)తో స‌రిపోక‌పోవ‌డంతో మార్చురీలోనే ఉండిపోయాయి. ఇందుకు సంబంధించిన అధికారిక రిపోర్ట్ ఒక‌టి ఓజీ న్యూస్ చేతికి చిక్కింది.

మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి 42 మంది మృతి చెందిన‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న రాగా.. ఈరోజు ఉద‌యం మ‌రో ఇద్ద‌రు కార్మికులు మ‌ర‌ణించారు. ప‌నేషియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆరిఫ్‌, ధ్రువ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న అఖిలేశ్వ‌ర్ మృతి చెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ మృతుల సంఖ్య 44కు చేరిన‌ట్లు స‌ర్కారు ప్ర‌క‌టించింది.

ఆ మృత‌దేహాలు ఎవ‌రివి..?
ప్ర‌మాద స‌మ‌యానికి ఎంత‌మంది కార్మికులు లోప‌ల ఉన్నార‌నే దానిపై పూర్తి స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌మాదం జ‌రిగిన తేదీ, మ‌రుస‌టి రోజుకి 36 మృత‌దేహాలు ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. మ‌రో 8 మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. మొత్తం 44 మందికి పోస్టుమార్టం పూర్త‌యింది. అయితే, కొన్ని గుర్తుప‌ట్టలేని స్థితిలో ఉన్న మృత‌దేహాల కోసం.. కుటుంబ స‌భ్యుల ర‌క్త న‌మూనాల‌ను అధికారులు సేక‌రించారు. వీరిలో మొత్తం 53 మంది ర‌క్త న‌మూనాలు సేక‌రించ‌గా.. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ప్ర‌మాద స్థ‌లంలో దొరికిన 67 శ‌రీర భాగాల‌ను డీఎన్ఏ ప‌రీక్ష‌లకు పంపించారు. ఇందులో 36 రిపోర్టులు రావాల్సి ఉంది. మిగ‌తా 31లో డీఎన్ఏ ప‌రీక్షల ఆధారంగా 26 మృత‌దేహాలు ఇప్ప‌టివ‌ర‌కూ కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. మిగ‌తా ఐదింటి సంగ‌తి ఇంకా తేల‌లేద‌ని స‌మాచారం.

pashamylaram sigachi blast

ఏ రోజు ఎలా..?
ప్ర‌మాదం జ‌రిగిన రోజు 36 మందిని ఆసుప‌త్రుల్లో చేర్పించారు. జూలై 1న ఒకరు, జూలై 4న ఒక‌రు, 5న ఒక‌రు, 6న ఒక‌రు, 8వ తేదీ ఉద‌యం 2 మందిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో జూలై 1న 13 మంది, జూలై 2వ తేదీన 5గురు, 3న ముగ్గురు, నాలుగో తేదీన 13మంది, ఐదో తేదీన న‌లుగురు, ఆరో తేదీన న‌లుగురు, మంగ‌ళ‌వారం 8వ తేదీన మ‌రో ఇద్ద‌రు.. మొత్తం 44 మంది మృతి చెందిన‌ట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

ప్ర‌ణం ఆసుప‌త్రి, ధ్రువ ఆసుప‌త్రి, ప‌నేషియా, అర్చ‌న‌, స్టార్‌, య‌శోద‌, కిమ్స్ ఇలావివిధ ఆసుప‌త్రుల్లో 38 మందిని చేర్పించ‌గా.. మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి 15 మంది చికిత్స పొందుతుండ‌గా.. మ‌రో 15 మంది ఇప్ప‌టికే డిశ్చార్జి అయిన‌ట్లు స‌మాచారం. వీరిలోనే 8మంది మ‌ర‌ణించారు.

ఘ‌ట‌నాస్థలానికి రానున్న‌ ఎన్‌డీఎమ్ఏ..
నేడు ప్ర‌మాద స్థలానికి ఎన్‌డీఎమ్ఏ(నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) అధికారులు రానున్నారు. ప్ర‌మాదం జ‌ర‌గడానికి కార‌ణాలు, మృతులకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నివేదిక స‌మ‌ర్పించ‌నున్నారు. భ‌విష్య‌త్తులో ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల ప‌ట్ల‌ సైతం ఎన్‌డీఎంఏ అధికారులు ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *