Pashamylaram Blast: పాశమైలారం ఫార్మా పరిశ్రమలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న భారీ పేలుడు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పాశమైలారం ప్రాంతానికి చేరుకున్న సీఎం… ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పేలుడు ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించిన ఆయన, మరో 17 మంది మిస్సింగ్‌గా ఉన్నారని చెప్పారు. ప్రమాద సమయంలో మొత్తం 143 మంది కార్మికులు ఆ పరిశ్రమలో పని చేస్తున్నారని, వీరిలో 53 మంది వివరాలు మాత్రమే ఇప్పటివరకు అందాయని తెలిపారు. మిగిలిన వారు శిథిలాల కింద ఉన్నారా, లేక ప్రమాద భయంతో ఎక్కడికైనా పారిపోయారా అనే విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు, జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని సీఎం తెలిపారు. మృతదేహాల తరలింపు, క్షతగాత్రుల ఆసుపత్రికి తరలింపును అధికారులు నిఖార్సైన క్రమంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రతతో పరిగణిస్తోందని, బాధితులకు తగిన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.10 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం కలిసి అందిస్తున్నాయని తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని సీఎం పేర్కొన్నారు. బాధ్యులను గుర్తించిన వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పరిశ్రమలకు తగిన సూచనలు ఇవ్వాలని, పరిశ్రమలు వాటిని అమలు చేయాలనే దిశగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే, అధికారులు పరిశ్రమలపై తరచుగా తనిఖీలు జరపాలని, కార్మికుల భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదని ఆదేశించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల విద్యా బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమ యాజమాన్యాలు కార్మికుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.