పాకిస్థాన్ vs పాకిస్థాన్‌.. యుద్ధం వేళ అంత‌ర్గ‌త ముస‌లం!

Share this article

India-Pakistan: ఓవైపు భార‌త్‌కు యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్‌కు(Pakistan) ఆ దేశంలోని అంత‌ర్గ‌త యుద్ధం ఇప్పుడు పెద్ద స‌వాలుగా మారుతోంది. పాకిస్థాన్ అక్క‌డి సైన్యం చెప్పుచేత‌ల్లో న‌డుస్తుంది. ప్ర‌ధాని, అధ్య‌క్షుల కంటే కూడా సైన్య‌మే(Pak Army) అక్క‌డ సుప్రీం ప‌వ‌ర్‌. అయితే, ప్ర‌స్తుతం సైన్య‌మంతా భార‌త్‌పై దాడి మీద దృష్టి పెట్టి స‌రిహ‌ద్దుల‌కు చేరుకోవ‌డంతో.. అక్క‌డి తిరుగుబాటుదారుల‌కు స్వేచ్ఛ లభించిన‌ట్ల‌యింది. ఇప్ప‌టికే బ‌లూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రెబ‌ల్ సైన్యం బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ(Baloochistan Liberation Army).. సొంత దేశ‌పు సైన్యంపైనే వ‌ర‌స దాడులు చేస్తుండ‌గా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు సైతం ఇదే అద‌నుగా పోరాటం మొద‌లుపెడుతున్నారు. ఇప్పుడు ఆ దేశ ప్ర‌భుత్వాన్ని ఈ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు అత‌లాకుత‌లం చేస్తున్నాయి.

ఇమ్రాన్ అనుచ‌రుల తిరుగుబాటు!
అవినీతి ఆరోప‌ణ‌ల‌పై పాక్ మాజీ ప్ర‌ధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను ఆర్మీ బంధించింది. దాదాపు రెండు నెల‌లుగా జైల్లో మ‌గ్గుతున్న ఇమ్రాన్‌ను క‌లిసేందుకు పార్టీ నేత‌లు, ఆయ‌న చెల్లెళ్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తించ‌ట్లేదు. భార‌త్‌పై యుద్ధం వ‌ద్ద‌ని పీటీఐ ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. అయితే, ఏప్రిల్‌లో ఆయ‌న ముగ్గురు చెల్లెళ్లు, పీటీఐ ఎంపీలు ఇమ్రాన్ ఖాన్‌ను నిర్బంధించిన పంజాబ్ ప్రావిన్స్‌లోని రావ‌ల్పిండి జైలుకు వెళ్ల‌గా వారిని అరెస్టు చేశారు పోలీసులు. బెయిల్‌పై విడుద‌లైన ఈ బృందం.. ఈరోజు ఉద‌యం భార‌త్ దాడి త‌ర్వాత మ‌రోమారు జైలుకు వెళ్లారు. అక్కడికి పెద్ద ఎత్తున పీటీఐ మ‌ద్ద‌తుదారులు చేరుకోవ‌డంతో పంజాబ్ పోలీసులు లాఠీఛార్జీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో ఇమ్రాన్ ఖాన్ సోద‌రీమ‌ణుల‌తో పాటు పీటీఐ పార్ల‌మెంటు స‌భ్యులు ఉమ‌ర్ ఆయుభ్ ఖాన్‌, ఖాసీ నియాజీ, ప‌లువురు ముఖ్య నేత‌ల‌పై పోలీసులు దాడి చేసిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో ఇలాంటి ఉద్రిక్త‌త‌ల వేళ‌నే మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను జైలు నుంచి త‌ప్పించారు అక్క‌డి సాయుధ స్థానికులు. ఇప్పుడు ఇమ్రాన్ నూ అలానే విడిపించుకునేందుకు విఫ‌ల య‌త్నం చేస్తున్నార‌ని వినికిడి.

రెబ‌ల్ ఆర్మీకి అందివ‌చ్చిన అవ‌కాశం!
పాకిస్థాన్ నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందేందుకు బ‌లూచిస్థాన్ కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తోంది. ఇక్క‌డి కొంద‌రు యువ‌కులు బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ(బీఎల్ఏ) పేరిట ఓ రెబ‌ల్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అక్క‌డి సైన్యంపై దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సైతం భార‌త్‌పై యుద్ధానికి బ‌లూచిస్థాన్ మీదుగా స‌రిహ‌ద్దుకు వెళ్తున్న‌ ఆర్మీ కాన్వాయ్‌పై భారీగా దాడులు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 30మందికి పైగా పాక్ సైనికులు మ‌ర‌ణించిన‌ట్లు అక్క‌డి మీడియా రిపోర్ట్ చేసింది. అయితే, పాక్ సైన్యమంతా భార‌త్‌పై దృష్టి కేంద్రీక‌రించ‌డంతో ఇదే అద‌నుగా బీఎల్ఏ పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న 12 ప్ర‌ధాన న‌గ‌రాల‌ను త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్న‌ట్లు స‌మాచారం.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *