
India-Pakistan: కశ్మీర్ ఉగ్రదాడి మొదలు.. నిర్విరామ కవ్వింపులతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన దాయాది ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్‌తో పాటు సింధూ జలాల ఒప్పందం(Indus Water), వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో వెనకడుగు వేసింది. కశ్మీర్ దాడికి ప్రతిగా పాకిస్థాన్‌కు జీవనాడిగా ఉన్న సింధూ నదీ జలాలను భారత్ ఆపేసింది. ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నామని.. మన నీళ్లపై మనకు మాత్రమే హక్కు ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. దీని తర్వాత సైతం భారత్‌పైకి దాడికి దిగిన పాక్‌కు గత వారం రోజులుగా నీటి కటకట మొదలైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్, పంజాబ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటికి సైతం తీవ్ర ఎద్దడి మొదలైంది. దేశానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పాక్ బుధవారం భారత్‌కు అధికారిక లేఖ రాసింది.
పాకిస్థాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా(Syed Ali Murtuza).. భారతీ జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన ఈ లేఖలో భారత్ తీసుకున్న సింధూ జలాల నిలిపివేతతో దేశంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని.. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని వేడుకుంటున్నామని కోరింది.