ఉద్యోగం కోసం ప్రయత్నించకండి – ఉద్యోగాలు సృష్టించండి.. 2022 మార్చి 9న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల వేదికగా అప్పటి తెలంగాణ ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే.టి. రామారావు (కేటీఆర్) పట్టభద్రులను ఉద్దేశించి అన్న మాటలివి..

అగ్రరాజ్యం అమెరికా(America)లో భారత రాష్ట్ర సమితి(BRS Party) రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఓ ఎన్నారై రాసిన వ్యాసమిది.

రచయిత: డీ వీ ఎల్ వర్ధన్, ఎన్నారై, యూఎస్ఏ (DVL Vardhan, NRI – USA)
“ఉద్యోగం కోసం ప్రయత్నించకండి – ఉద్యోగాలు సృష్టించండి..” 2022 మార్చి 9న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల వేదికగా అప్పటి తెలంగాణ ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే.టి. రామారావు (KTR) పట్టభద్రులను ఉద్దేశించి అన్న మాటలివి..
ఇది తెలంగాణా రాష్ట్రానికో, ఆ సందర్భానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత భవితను నిర్దేశించే మాటలవి. 2022లోనే కాదు.. అంతకు పాతికేళ్ల ముందు నుంచే కేటీఆర్‌వి ఇవే ఆలోచనలు. ఆ దూరదృష్టే.. రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సారథ్యంలో సర్కారు కొలువుదీరిన కొన్ని రోజులకే ప్రతిష్టాత్మక టీ-హబ్(T HUB)ను హైదరాబాద్‌కు పరిచయం చేసింది. అదే, ఇప్పుడు తెలంగాణా(Telangana) క్యాపిటల్‌ను విశ్వనగరంగా సగర్వంగా నిలబెట్టింది.

సుమారు 140కోట్ల పౌరులతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్(India) అవతరించింది. అందులోనూ యువత అత్యధికంగా ఉన్నదీ మన దేశంలోనే. జనాభా ఎంతెంత పెరుగుతూ వస్తోందో నిరుద్యోగమూ అంతకంతకు పెరుగుతోంది. దానికి తోడు కొవిడ్‌లాంటి మహమ్మారులు గోటి చుట్టూ రోకటి పోటులా తయారవుతున్నాయి. తెలంగాణాలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రతీ ఏటా మన రాష్ట్రం నుంచే సుమారు 55వేల మంది విద్యార్థులు ఐటీ, కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సుల్లో పట్టభద్రులై కాలేజీల నుంచి బయటకి వస్తున్నారు. కానీ, ఇందులో పది శాతం మంది మాత్రమే ఆయా కోర్సులకు సంబంధించిన ఉద్యోగాలు సాధిస్తుండగా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుంటే.. కొందరు చదువుకు ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగాలలో బతుకీడుస్తున్నారు.
దీనికి తోడుగా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు(AI)లు.. సాంప్రదాయ ఐటీ ఉద్యోగాల(IT Jobs) ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రేపటిని తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. దీన్ని అందరి కంటే ముందే అంచనా వేయడంలో కేటీఆర్ సఫలమయ్యారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఆ అంచనానే, ఓ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆవిష్కరణల కేంద్రానికి పురుడు పోసింది.
ఉద్యోగాల కొరతను అధిగమించేలా, మన రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ప్రత్యామ్నాయంగా టీ-హబ్ పేరిట స్టార్టప్‌ల ప్రోత్సాహక కేంద్రాన్ని(Startup Incubation Centre) తీసుకొచ్చారు కేటీఆర్. ఇది స్థాయితో సంబంధం లేకుండా యువతకు తమ కలల్ని నెరవేర్చుకునేందుకు.. అంకురాలను స్థాపించుకునేందుకు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దన్నుగా నలిచింది.

స్టార్టప్ హబ్ అనే ఆలోచన 1990ల్లో సిలికాన్ వ్యాలీలో పుట్టింది. విద్యా సంస్థలు, కార్పొరేట్ టెక్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసే కేంద్రంగా ఆవిర్భవించింది. అదే నమూనా లండన్, బెర్లిన్, తెల్ అవీవ్ వంటి ప్రపంచ నగరాల్లో విజయం సాధించింది. భారత్‌లో బెంగళూరు వంటి కేంద్రాలు అక్కడ పరిస్థితుల దృష్ట్యా.. స్టార్టప్‌లకు కేంద్రంగా మారిన.. 2015లో తెలంగాణాలో ఇక్కడి క్యాపిటల్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన టీ-హబ్ మాత్రం అన్నింటికీ ధీటుగా నిలిచింది. ఆ మరుసటి ఏడాదే జాతీయ స్థాయిలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర సర్కారు ప్రారంభించడం గమనార్హం.
కేటీఆర్ సారథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న విధానాల ఏర్పాటు, ప్రపంచస్థాయి సంస్థ భాగస్వామ్యంతో.. బయో నుంచి బ్లాక్ చైన్ దాకా.. డిఫెన్స్ నుంచి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ దాకా దాదాపు 2వేలకు పైగా యువ అంకురాలు ఈ కేంద్రంగా పుట్టుకొచ్చాయంటే మామూలు విషయం కాదు. దాదాపు 2బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకురావడంతో పాటు 10వేలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో ఈ టీ-హబ్ కీలక భూమిక పోషించింది. 2022లో టీ-హబ్ 2.0తో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐటీ హైదరాబాద్‌తో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో భాగమయ్యాయి.

అనేక వేధికలపై కేటీఆర్.. భారతీయులు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు నడుపుతున్నా, వాటిలో పనిచేస్తున్నా.. ఏవీ ఇక్కడ స్థాపించినవి కావని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలనే, పారిశ్రామికవేత్తలకు, ఆవిష్కర్తలకు కేరాఫ్ తెలంగాణ, కేరాఫ్ భారత్ అవ్వాలనే ఈ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. అదే నేడు అనేక మంది యువకుల కలల్ని నిజం చేస్తూ.. విశ్వ వేధికపై మన జెండాను రెపరెపలాడిస్తోంది. ఇది కేటీఆర్ మార్క్ అభివృద్ధి.. లాంగ్ లీవ్ విజనరీ లీడర్!