
Hyderabad: జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న తొలి చిత్రం వార్-2(War-2)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ గురించి శుక్రవారం జూనియర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన ఎక్స్(X) ఖాతాలో.. మే 20న నువ్వేం చూడబోతున్నావో నీ ఊహకు కూడా అందదు అంటూ ఎన్టీఆర్‌ను ఉటంకిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. దానికి ఎన్టీఆర్.. ‘నిన్ను వెంటాడి మరీ నీకు స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను కబీర్..’ అంటూ బదులిచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి ట్వీట్లను ఇద్దరు హీరోల ఫ్యాన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు.
బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ రా ఏజెంట్ గా ఆంటగనిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. వార్ 1 చిత్రంలో హృతిక్ రోషన్ కబీర్‌గా నటించగా.. ఆ కథకు కొనసాగింపుగానే వార్-2 రాబోతోంది. కియారా అద్వానీ ఈ ఇద్దరి సరసన నటిస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు.