పరిగెత్తించి కొట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.. పోలీసుల రక్షణలో తలదాచుకున్న నేత
NRI: నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ కార్మికుల సమస్యల కేంద్రంగా రగడ ఏర్పడింది. ఇటు బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త భౌతిక దాడులకు చేరింది. గల్ఫ్ కార్మికులతో కలిసి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్తామని సవాల్ చేసి.. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ NRI సెల్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. చొక్కా చింపి.. రోడ్లపై పరిగెత్తిస్తూ దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి దేవేందర్ రెడ్డికి రక్షణ కల్పించారు.
గల్ఫ్ కార్మికుల మృతిపై ప్రభుత్వం నిస్సహాయంగా వ్యవహరిస్తోందంటూ ఇటీవల మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన స్వగ్రామమైన వెల్పూర్లో ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు అనే పేరుతో కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ బాధిత కుటుంబాలూ పాల్గొన్నాయి. కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి కౌంటర్‌గా, బీఆర్ఎస్ వర్గీయులు రైతు సమస్యలనెత్తుకున్నారు. అయితే, గల్ఫ్ కార్మికులు మీ ముందే ఉంటే ఎందుకు సైడ్ ట్రాక్ చేస్తున్నారంటూ మొదలైన వాగ్వాదం.. మాటా మాటా పెరిగి హింసాత్మకంగా మారింది.

దేవేందర్ రెడ్డి పై దాడి
కాంగ్రెస్ నేత దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ – “తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను 18 మంది లబ్ధిదారులకు చెల్లించింది. వీరితో కలిసి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి తాము హామీలు నెరవేర్చుతున్నామన్న విషయం చాటి చెప్పాలనుకున్నాం,” అన్నారు. అయితే, ఆయన ఇంటికి చేరుతున్న సమయంలో బీఆర్ఎస్ అనుచరులు ఎన్నారై సెల్ నేతలు దేవేందర్ రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రశాంత్ రెడ్డి స్పందన..
ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. దేవేందర్ రెడ్డికి రక్షణ కల్పించినట్టు సమాచారం. మరోవైపు, వేముల ప్రశాంత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. మేం ప్రశ్నిస్తుంటే మా ఇంటిపై దాడికి తెగబడ్డారు. అందుకే మావాళ్లు తిరగబడ్డారంటూ చెప్పుకొచ్చారు.
