
Neet 2025: ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2025 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 1:30లోపు కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలను తప్పకుండా వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
ఎప్పటిలాగే ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫోన్, చేతి గడియారం, బ్లూటూత్, షూస్, బంగారు, వెండి ఆభరణాలు, పెన్నులు, ప్యాడులు మొదలైన ఏ వస్తువుకూ కేంద్రానికి అనుమతి లేదు. పరీక్షలో బెల్ట్ సైతం అనుమతించరనే విషయం గుర్తుంచుకోవడంతో పాటు పైన చెప్పిన ఏ వస్తువునూ వెంట తీసుకెళ్లొద్దు. హైదరాబాద్‌లో పరీక్ష జరుగుతున్నచాలా కేంద్రాల్లో వస్తువులు భద్రపరిచే కేంద్రాలు లేవని గుర్తుంచుకోవాలి. పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, అడ్మిట్ కార్డు మరిచిపోవద్దు. 11 గంటలకే కేంద్రాలకు చేరుకునే ప్రయత్నం చేయండి. మౌలాలీ, తిరుమలగిరి, మల్లాపూర్ కేంద్రాలకు చేరుకునే దారులు రద్దీగా ఉంటాయి. ఈ కేంద్రాల అభ్యర్థులు కాస్త ముందుగానే కేంద్రాలకు చేరుకునే ప్రయత్నం చేయండి.