
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) పరీక్షలను ఒకే షిఫ్టులో నిర్వహించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బిఇ) బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.
షిఫ్టుల వారీగా పరీక్షలు నిర్వహించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం ఈమేరకు తీర్పునిచ్చింది.
అయితే, దేశంలో పరీక్ష కేంద్రాల కొరత ఉండటంతో ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహిస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని బోర్డు తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్ , పీవీ సంజయ్ కుమార్ , ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. జూన్ 15న జరగనున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 2.4 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు.