టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్

Amaravathi: నారా లోకేష్.. తండ్రి చాటు కొడుకన్న చోటే తన సత్తా ఏంటో చూపించాడు. అవమానాలు, హేళనలు, వ్యక్తిగత విమర్శలనూ తట్టుకుని.. ఎక్కడా తడబడకుండా ఏపీ రాజకీయ క్షేత్రంపై గట్టిగా నిలబడ్డాడు. ఓడిన చోటే ప్రత్యర్థుల ఊహకు అందని ఆధిక్యంతో గెలిచాడు. ఇక పార్టీ పనైపోయిందనే ప్రచారం ఊపందుకున్న వేళ.. యువగళం పాదయాత్రతో క్షేత్రస్థాయి పార్టీ పరిస్థితిని మలుపు తిప్పాడు. కేడర్‌కు అడుగడుగునా నేనున్నానని భరోసానిచ్చి.. మొన్నటి ఎన్నికల్లో తెదేపా మార్క్ విజయంలో తనదైన ముద్ర వేశాడు ఈ నలభై ఏళ్ల స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్. త్వరలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్(Nara Lokesh) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఓజీ స్పెషల్ స్టోరీ.
43 ఏళ్ల చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇందులో అధికారంలో ఉన్న రోజులే ఎక్కువ. నాడు నందమూరి తారక రామారావు నుంచి నేటి చంద్రబాబు నాయుడి దాకా అత్యధిక కాలం సీఎం పీఠమూ టీడీపీదే. ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలో ఓ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి.. జాతీయ స్థాయిలో పీఎం పీఠాన్ని సైతం కదిలించిన స్థానిక పార్టీగానూ తెదేపాదే చరిత్ర. కానీ, 2019 ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ. వైసీపీ క్లీన్ స్వీప్‌తో పార్టీ పూర్తిగా పడిపోయింది. తర్వాత ఐదేళ్ల పాటు అప్పటి అధికార వైకాపా కక్షపూరిత రాజకీయాలు క్షేత్రస్థాయిలో పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. జిల్లా, మండల స్థాయిలో ప్రశ్నించిన నేతలపై దాడులు, కేసులు అడుగు ముందుకేయాలంటేనే భయపడేలా చేశాయి. దీనికి తోడు గత వైభవాన్ని గుర్తు చేస్తూ ప్రత్యర్థుల హేళనలు, పార్టీ అధినేత, కుటుంబ సభ్యులకు వ్యక్తిగత అవమానాలు, చంద్రబాబు అరెస్టు.. వీటన్నింటి నడుమా ఇక పార్టీ మరుగున పడుతుందనే అనుకున్నారంతా. కానీ, ఒంటిచేత పార్టీని నడిపిస్తూ, ఒకే పాదయాత్రతో అన్నీ మార్చేశాడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

ఒక్క యాత్ర.. ఒక్కటి చేసిన యాత్ర!
తెదేపా సీనియర్ నాయకత్వం సూచనలు పాటిస్తూనే.. రాష్ట్ర యువతను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో లోకేష్ సఫలమయ్యారు. ప్రతీ జిల్లాలో పాదయాత్ర చేసి అక్కడ యువతకు పార్టీపై, భవిష్యత్తుపై నమ్మకం కల్పించారు. అదే మొన్నటి ఎన్నికల్లో పార్టీకి కీలకంగా మారింది. జనవరి 27, 2023న ప్రారంభమైన యాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా దాదాపు 100కుపైగా నియోజకవర్గాలు, 4వేల కిలోమీటర్ల దాకా సాగింది. అప్పటి ప్రభుత్వంలో రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగత, నిర్వీర్యమైన విద్యా వ్యవస్థ, స్థానిక యువత భవితను కాలరాస్తున్న కొందరు నేతల అకృత్యాలను ఎండగట్టడంతో ఈ యాత్ర సఫలమైంది. అదే తెదేపాకు పునర్వైభవం తెచ్చిపెట్టింది.

తెరవెనకే ఉంటూ..!
ప్రతిష్టాత్మక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన లోకేష్.. 2013లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి మహానాడులోనే పార్టీ సభ్యత్వం తీసుకుని ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. రెండేళ్లకు పైగా పార్టీకి తెరవెనుకే ఉంటూ కీలక నిర్ణయాల్లో భాగం పంచుకున్నారు. ఆ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా, కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యునిగా పార్టీ పనితీరుని అవపోసన పట్టారు. 2017లో ఎమ్మెల్సీగా ఆ వెంటనే మంత్రిగా అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలోనూ కీలక భూమిక పోషించారు. పాఠం నేర్చుకునేందుకు సిద్ధపడే పార్టీకి ఏమాత్రం పట్టులేని మంగళగిరి నుంచి 2019 ఎన్నికల్లో పోటీచేసి కేవలం 5వేల ఓట్లతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాతి వారం నుంచే ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు సాగించారు. అదే ఆయనకు 2024 ఎన్నికల్లో మంగళగిరిలో భారీ మెజారిటీ కట్టబెట్టింది.
ఈ మహానాడు.. మరో మలుపు!
2013 మహానాడులో పార్టీలోకి వచ్చిన లోకేష్.. 12 ఏళ్ల తర్వాత 2025లో ఈనెల 26-29 మధ్య కడపలో జరిగే మహానాడులో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు పూర్తిగా లోకేష్‌కి అప్పజెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీలో ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న సీనియర్లను సలహాదారులగా నియమించి.. ఆ స్థానాల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న యువతను తీసుకురావాలని పార్టీ యోచిస్తోంది. మండల స్థాయిలో మూడేళ్లకు పైగా కార్యవర్గాల్లో ఉన్న నేతలకు రాష్ట్రస్థాయి హోదా కల్పించనుండగా.. ఆ పై స్థాయి నేతలకు కీలక పదవులు కట్టబెట్టనుంది. ఈ యువ బృందంతో కలిసి క్షేత్రస్థాయి లోపాలను సరిదిద్దుతూ.. పార్టీని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు లోకేష్.

తండ్రికి తగ్గ తనయుడై..!
“ఆర్థిక వ్యవస్థ మెరుగు పడాలంటే ప్రభుత్వ జోక్యం తగ్గాలి. ఎక్కడ ప్రభుత్వం తప్పనిసరి అవసరమో అక్కడ మాత్రమే మార్కెట్‌తో కలిసి పనిచేయాలి. మిగతావన్నీ మార్కెట్ చూసుకోవాలి. ఇదే భవిష్యత్తు. ప్రభుత్వ జోక్యం తగ్గితేనే పాలనలో నాణ్యత పెరుగుతుంది..” 1995లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలివి. అగ్రరాజ్యం అమెరికా ఏళ్లుగా పాటిస్తోన్న సిద్ధాంతమిది. దాదాపు 30ఏళ్ల తర్వాత భారత కేంద్ర ప్రభుత్వం ఈ వైపుగా అడుగులేస్తోంది. అన్నింట్లో ముందుచూపుతో వ్యవహరించడం, అనుకుంటే చేసి తీరడం చంద్రబాబు తీరు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్.. కాస్త తడబడినా.. తండ్రికి తగ్గ తనయుడని టీడీపీ శ్రేణులే కాదు, తెలుగు ప్రజలతో మెప్పించుకున్నారు. గతంలో మంత్రిగా కీలక అంతర్జాతీయ సంస్థలను ఏపీకి తెచ్చే ప్రయత్నం చేసిన లోకేష్.. ఈ ఏడాది కాలంలోనే 30కి పైగా కీలక సంస్థలను ఏపీకి తీసుకొచ్చారు. ఇప్పటికే అనుమతులు పొంది కార్యరూపం దాల్చుతున్న రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల ద్వారా తన మార్క్ పాలనను పరిచయం చేస్తున్నారు.