Mumbai Blasts: ముంబై పేలుళ్ల ఘటనపై ఇటీవల రాజ్యసభకు ఎంపికైన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్లకు ఒకరకంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కారణమంటూ బాంబు పేల్చారు. దత్ తలుచుకుని ఉంటే ఈ పేలుళ్లు జరిగేవి కాదంటూ చెప్పుకొచ్చారు. 1993లో మహానగరం ముంబైలో జరిగిన వరుస పేలుళ్లు దేశాన్ని కుదిపేశాయి. ఈ కేసులో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఉజ్వల్ నికమ్ వాదించిన విషయం తెలిసిందే.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ — “1993, మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. అయితే ఆ పేలుళ్లకు కొన్ని రోజుల ముందే సంజయ్ దత్ ఇంటికి ఓ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్‌ను గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూసలేం పంపించాడు. అందులో ఏకే-47 తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు, బాంబులు ఉన్నాయి. సంజయ్ వాటిని పరిశీలించాడు. అందులోని ఒక ఏకే-47 తుపాకీని తన దగ్గర ఉంచుకున్నాడు. అదే సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే 1993 పేలుళ్లను ఆపి ఉండేవాడు. ఎన్నో ప్రాణాలను కాపాడి ఉండేవాడు” అని తెలిపారు.
ఈ కేసులో సంజయ్ దత్‌పై టాడా కింద కేసు నమోదైంది. కొన్ని వర్గాలు ఆయనను ఉగ్రవాదిగా ఆరోపించాయి. అయితే కోర్టు సంజయ్‌ను ఉగ్రవాదిగా నిర్ధారించలేదు, కానీ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగం రుజువైంది. దీంతో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆయన పుణెలోని యరవాడ జైలులో శిక్ష అనుభవించి 2016లో విడుదలయ్యారు.
ఇదిలా ఉండగా, ఉజ్వల్ నికమ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తాజాగా ఆయనను రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసింది.