Microsoft: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతుందన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవలే మే నెలలో సుమారు 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంస్థ, మరో రౌండ్ లేఆఫ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలొస్తున్నాయి. వచ్చే నెలలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు సంస్థ అధికారికంగా స్పందించలేదు.
ఈసారి ఎవరిపై ప్రభావం?
ఈసారి లేఆఫ్స్ ప్రభావం కస్టమర్ ఫేసింగ్ రోల్స్ ఉన్న ఉద్యోగులపై ఎక్కువగా ఉంటుందని సమాచారం. గత లేఆఫ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ డెవలపర్లు ఎక్కువగా నష్టపోయిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌లో ప్రస్తుతం సుమారు 2.28 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో సేల్స్, మార్కెటింగ్ విభాగంలో మాత్రమె సుమారు 45 వేల మంది ఉన్నారు.
థర్డ్ పార్టీ సంస్థలకే బాధ్యత?
స్వల్ప, మధ్య తరహా సంస్థలతో సంబంధం ఉన్న మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల విక్రయ, మార్కెటింగ్ బాధ్యతలను థర్డ్ పార్టీ ఫర్మ్స్‌కు బదిలీ చేయాలని సంస్థ ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లోనే ఈ ప్రణాళికపై స్పష్టత వచ్చింది. దీంతో సేల్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో భవిష్యత్‌పై అనేక సందేహాలు మొదలయ్యాయి.

ఏఐ ఫోకస్ – ఉద్యోగాల మళ్లింపు
మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలపై భారీ దృష్టి సారిస్తోంది. సంస్థ ఈ ఏడాదిలోనే సుమారు 80 బిలియన్ డాలర్లు డాటా సెంటర్ల అభివృద్ధికి కేటాయించినట్లు సమాచారం. ఇది ఖర్చుల పరంగా సంస్థకు పెద్ద భారం కాగా, కమర్షియల్ సెగ్మెంట్లలో వ్యయ నియంత్రణ చర్యలు ముమ్మరం చేసింది.
గతంలో ఏం జరిగింది?
పనితీరు ఆధారంగా ఉద్యోగుల తొలగింపు జరగలేదని, ఇది సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో పెద్దఎత్తున నియామకాలు చేసిన ఈ సంస్థ, 2023 జనవరిలోనే 10 వేల మందిని తొలగించింది. అదేవిధంగా, వీడియో గేమింగ్ విభాగంలోనూ ఇటీవల మార్పులు చేపట్టింది.
ఏఐ వల్ల ఉద్యోగాల భయం
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ నేపథ్యంలో, ఉద్యోగుల భద్రతపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా క్లరికల్, కస్టమర్ సర్వీస్, క్రియేటివ్ రోల్స్‌లో ఆటోమేషన్ రిస్క్ అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓ సర్వేలో భారత్‌లో 66 శాతం మంది ఉద్యోగులు తమ పని స్థానంపై ఏఐ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అదే సమయంలో 65 శాతం మంది ఏఐ వల్ల కలిగే లాభాల పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.
ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని, మానవ వనరులను మరిన్ని సృజనాత్మక పనుల వైపు మళ్లించేందుకు ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.