Cinema: ప్రముఖ నటి మాళవికా మోహనన్ తన కాలేజ్ రోజుల్లో ఎదుర్కొన్న ఓ భయానక అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగిన ఈ సంఘటనను వివరించిన ఆమె, ఆ క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని చెప్పారు.
మాళవికా చెప్పిన వివరాల ప్రకారం… కాలేజ్ డేస్‌లో ముంబై లోకల్ ట్రైన్‌లో రాత్రి 9:30 గంటల సమయంలో స్నేహితురాళ్లతో కలిసి ప్రయాణించాను. మేము ప్రయాణించిన ఫస్ట్ క్లాస్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో పెద్దగా ఎవరూ లేరు. దాదాపుగా ఖాళీగానే ఉంది. అప్పటికే రైలు వేగంగా పరుగెడుతోంది. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి, మా కిటికీ దగ్గర నిలబడి, “ఏక్ చుమ్మా దేగీ క్యా?” (ఒక ముద్దు ఇస్తావా?) అంటూ అసభ్యంగా మాట్లాడాడు. ఆ వ్యక్తి మాటలు వినగానే మేమంతా ముగ్గురం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాం. ఆ సమయంలో మేము నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోయాం.
ఆ ట్రైన్ ఆగే వరకు, అంటే దాదాపు 10 నిమిషాల పాటు మేము ఆ భయంతోనే గడిపాం. ఎట్టకేలకు తదుపరి స్టేషన్ వచ్చినప్పుడు మరింత మంది ప్రయాణికులు కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కారు. అప్పుడే మేము కొంత ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఆ సంఘటన మేమందరిపై తీవ్ర మనోభారం మిగిల్చింది అని మాళవిక పేర్కొన్నారు.
ముంబై వంటి మహానగరంలో మహిళలు రోజూ ఇలా అనేక అవాంఛనీయ అనుభవాలను ఎదుర్కొంటున్నారని, మహిళల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై ముంబై పోలీసులు కూడా స్పందించారు. ముంబై పోలీస్ శాఖ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మాళవికా పంచుకున్న అనుభవంపై స్పందిస్తూ… “డియర్ మాళవికా, మీరు మీ అనుభవాన్ని పంచుకోవడం, ముంబై నగరంలోని మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం మేము గమనించాము. ఇలాంటి అనుభవాలు బాధాకరమైనవే కాదు, ఒక మహిళ జీవితంలో శాశ్వత ప్రభావం చూపించగలవని మేము బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం” అని పేర్కొన్నారు.
పోలీసులు తమ సందేశంలో, “నగరంలో ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా మీకు ఇబ్బంది ఎదురైతే వెంటనే 112 లేదా 100 నంబర్‌లకు ఫోన్ చేయండి. మేము తక్షణమే స్పందిస్తాము. మహిళలు ఫిర్యాదు చేయకపోతే నేరస్తులు మరింత ధైర్యం పొందే ప్రమాదం ఉంటుంది. మీ భద్రత మా ప్రథమ బాధ్యత. మీ ఫిర్యాదు వచ్చిన వెంటనే మేము నేరస్తుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాము. ముంబై మహిళలకు ఎల్లప్పుడూ సురక్షితమైన నగరంగా ఉండాలని, దాన్ని మరింత మెరుగుపరచడానికి మేము ఎలాంటి ప్రయత్నాలకూ వెనుకాడమం” అంటూ హామీ ఇచ్చారు.
మహిళల భద్రతపై మాళవిక చేసిన ఈ ఓపెన్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహిళలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మౌనంగా ఉండొద్దని, ఆ సంఘటనలపై ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ముంబై పోలీసులు ఇచ్చిన ఈ హామీపై కూడా అనేకమంది అభినందనలు తెలిపారు.