Mahabharatham: భీష్మ పుట్టుక రహస్యమిదే..!

beeshma pitamaha birth

Share this article

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం “దేవవ్రతుడు”. మ‌హాభారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. ఎంత‌టి శ‌క్తినైనా ఎదురించి నిల‌బ‌డే యోధునిగా.. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.

ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు.

వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.

వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగా దేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది.

ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదీలో సూర్యుని(Lord Surya)కి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటుంది.

ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధ పడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.

కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.

కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు.

beeshma pitamaha

ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని పిలవబడ్డాడు. బీష్మ పితామ‌హుడిగా.. మ‌హామ‌హితాత్ముడిగా.. కురు వంశ సామ్రాజ్యాన్ని కాపాడేందుకు త‌న జీవితాన్నే త్యాగం చేసిన వీరుడిగా చ‌రిత్ర‌లో నిలిచారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *