ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సాక్షి ఛానల్‌లో కేఎస్ఆర్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో జర్నలిస్టు, వైకాపా మద్దతుదారు కృష్ణంరాజు(Journalist Krishnam Raju) చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. మహిళలను అవమానించిన ప్రతీ ఒక్కరూ కాలగర్భంలో కలిసిపోయారని.. మీకూ ఆ గతి తప్పదంటూ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు, వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan)ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన ఆయన.. “మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుంద”న్నారు.
“అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అని నొక్కి వక్కానించిన లోకేష్.. భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది?
మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమంటూ” హెచ్చరించారు.
మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుంది. అంటూ శనివారం సాయంత్రం ఆయన ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.
Nara Lokesh, TDP News, YS Jagan, Andhra Pradesh, Amaravathi