
Hyderabad: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు బీజేపీ(BJP), ఇటు బీఆర్ఎస్(BRS) పార్టీలు విమర్శలు ఉద్ధృతం చేశాయి. దీనికి కాంగ్రెస్ నేతలూ గట్టిగానే బదులిస్తున్నారు. ఈ ముక్కోణ పోరులో.. బీఆర్ఎస్ పార్టీలో ముసలం వార్తలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆయుధంగా వాడుకుంటున్నాయి. హరీష్ రావు, కవిత సొంత పార్టీలు పెడుతున్నారంటూ జోస్యం చెబుతున్నాయి. అయితే, శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రావడం.. రెండు గంటలు సమావేశం అవడంతో ఇప్పుడు మరో దుమారం రేగుతోంది.
కేవలం తెలంగాణాలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించేందుకు మాత్రమే ఈ సమావేశం జరిగిందని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించినా.. కాంగ్రెస్ మాత్రం భిన్న వాదన చేస్తోంది. ఇటీవలె బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారని.. హరీష్ రావు సొంత పార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె కవిత సైతం దీనిపై ఆగ్రహంగా ఉందని.. ఆమె కూడా సొంత పార్టీ పెడుతుందంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. దీనిపై వివిధ వేధికలపై స్పందించిన హరీష్ రావు.. తాను ఎప్పటికీ కేసీఆర్ సైనికుడినని.. రేపు కేటీఆర్ కు బాధ్యతలు అప్పజెప్తే ఆయన సారథ్యంలో పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
అయితే, ఈనెలలో కేటీఆర్(KTR), కవిత(Kavitha Kalvakunta) అమెరికా వెళ్తుండగా.. ఈ సమయంలోనే పార్టీ మార్పు జరుగుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అమెరికాలో జరుగుతున్న తన కుమారుడి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కవిత.. సీబీఐ కోర్టు నుంచి ప్రత్యేక అనుమతితో వెళ్తున్నారు. కోర్టు ఆదేశాల మీదట 22న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. కవిత రాగానే అమెరికాలో జరిగే భారాస రజతోత్సవ వేడుకలకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఆయన వచ్చే నెల మొదటి వారంలో తిరిగొస్తారని సమాచారం. కేసీఆర్(KCR) సైతం వెళ్తారని వార్తలు వెలువడినా.. ఇంకా స్పష్టత రాలేదు.