
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) నాయకుడు కొడాలి నానీ(Kodali Nani)కి కృష్ణా జిల్లా పోలీసులు లుక్ అవుట్ నోటీసు(Look Out Notice)లు జారీ చేశారన్న వార్తలు గత రెండు రోజులుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్‌యంలో నానీ హైదరాబాద్‌లోనే ఉన్నారన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా నానీ పలు అక్రమాలకు పాల్పడటంతో పాటు గుడివాడలో బెదిరింపులు, మోసాలకు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
పలు కేసుల్లో అరెస్టు కాకుండా ఇప్పటికే హైకోర్టు(AP High Court) నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తనకు ఆరోగ్యం బాలేదని.. గుండె సంబంధిత శస్త్ర చికిత్స కోసం ఇటీవలె ముంబై వెళ్లిన నానీ.. అక్కడి నుంచే అమెరికా పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరోసారి ఆయన అరెస్టుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో భాగంగానే కృష్ణా పోలీసులు అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు నానీపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎవరైనా పరారీలో ఉంటే, పట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే ఈ నోటీసులు జారీ చేస్తుంటారు పోలీసులు. కానీ, నానీ మాత్రం దర్జాగా హైదరాబాద్‌లో తిరుగుతుంటే ఈ నోటీసులు అవసరమేంటంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. కొడాలి నానీ పాస్‌పోర్టు చిరునామా హైదరాబాద్ లో ఉండటం గమనార్హం.