‘వీర‌మ‌ల్లు’కి కీర‌వాణి ప్రాణం పోశారు: ప‌వ‌న్‌

Caption 1

Share this article

Hyderabad: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి(MM Keeravani) త‌న సంగీతంతో ప్రాణం పోశార‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్(AP Dy CM Pawan Kalyan) అన్నారు. మంగ‌ళ‌వారం కీర‌వాణి ఇంటికి వ‌చ్చిన ప‌వ‌న్‌.. ఆయ‌న‌తో చాలాసేపు సంగీత‌, సాహిత్యాల‌పై చ‌ర్చించారు. సినిమాలో అద్భుత‌మైన పాట‌లు, సంగీతం అందించినందుకు ఆయ‌న్ని స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. “మనలోని పౌరుషం.. వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు. ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ వినిపించ‌బోతున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి గారు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణి గారిలో అంకిత భావాన్ని తెలియచేస్తోందన్నారు.

ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి గారి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు – నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ గారు ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి గారు.

తెలుగు కథలను ప్రేమించే కీరవాణి గారు తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి గారు రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు… చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే… కానీ కీరవాణి గారు రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు..” అంటూ చెప్పుకొచ్చారు ప‌వ‌న్.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *