ఉత్తరాఖండ్ లో జరుగుతున్న పవిత్ర కేదార్‌నాథ్ యాత్రలో శనివారం ఉదయం ఒక సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేయడం కలకలం సృష్టించింది. రుద్రప్రయాగ జిల్లా గుప్తకాశి సమీపంలో ఈ ఘటన జరిగింది.
కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ హెలిప్యాడ్‌కు చేరుకునే సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ ముందస్తు జాగ్రత్తగా హెలికాప్టర్‌ను రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ హెలికాప్టర్ క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినది. సిర్సి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఈ హెలికాప్టర్ గుప్తకాశికి సమీపంలో ఈ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ వి. మురుగేషన్ స్పందించారు. “హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు” అని వెల్లడించారు.
ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UCADA) సీఎస్ఈవో మాట్లాడుతూ, “ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా హెలిప్యాడ్ కు బదులుగా రోడ్డుపై ల్యాండింగ్ చేశారు. ఇది పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యగా చేపట్టిన ల్యాండింగ్. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు,” అని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కు సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపంపై విచారణ కొనసాగుతోంది.
ఇతర సర్వీసుల కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం సాధారణంగా కొనసాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. యాత్రికులు భయపడాల్సిన అవసరం లేదని, యాత్రా రవాణా సేవలు సజావుగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో యాత్రికుల భద్రత, హెలికాప్టర్ నిర్వహణపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేదార్‌నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. అధికారులు భద్రతాపరమైన ఏర్పాట్లను మరింత పటిష్టంగా చేస్తున్నట్టు సమాచారం.
Helicopter, Technical Issue, Emergency Landing, Uttarakhand helicopter crash