Kaleshwaram: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాలు, కార్యాచరణ వైఫల్యాలపై ప్రారంభమైన పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఈ రోజు హాజరయ్యారు. ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి కార్యకర్తలు, కీలక నేతలకు కొద్దిసేపటి క్రితమే BRK భవన్‌కు చేరుకున్నారు కేసీఆర్. MLC కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు BRK భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్, బీఆర్కే భవన్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు.
కమిషన్ ఏర్పాటైన తర్వాత నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు విచారణకు హాజరై అఫిడవిట్లు సమర్పించారు. పలువురు కీలక అధికారుల విచారణ ఇప్పటికే పూర్తయింది. జూన్ 6వ తేదీన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరై పలు ప్రశ్నలకు జవాబివ్వగా.. జూన్ 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొన్నారు. అయితే, ఈ విచారణలో కేసీఆర్ పాల్గొనే అంశంపై ఎన్నో రోజులుగా ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించుతూ.. కేసీఆర్ ఈరోజు ఉదయం విచారణకు హాజరవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, ఆర్థిక ఖర్చులు, పనుల నాణ్యత వంటి అంశాలపై కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నలు అడగనుంది. అయితే ఇప్పటివరకు హాజరైన అధికారులు నేతలు చెప్పినట్లే చేశామని చెప్పగా.. మాజీ మంత్రి హరీష్ రావు ఇది ఇంజనీర్ల నిర్ణయమని.. వారు చెప్పినట్లే అన్ని నిర్మాణాలు జరిగాయన సమాధానమిచ్చారు. ఇప్పుడ కమిషన్ ప్రశ్నలకు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
BRK భవన్ చుట్టూ హెవీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిరోధించి, భవన పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఎర్రవల్లి నుంచి బీఆర్కే భవన్ వరకు కేసీఆర్ కాన్వాయ్‌కి భద్రత కల్పించకపోవడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈమేరకు ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఓ మాజీ సీఎంకు కనీస భద్రత కల్పించరా..? ప్రతిపక్ష నేత కేబినేట్ ర్యాంక్ కంటే ఎక్కువని తెలిసి కూడా కాన్వాయ్ ముందు ట్రాఫిక్ పైలట్ వాహనాన్ని కేటాయించరా అంటూ రాష్ట్ర పోలీస్ డీజీకి ట్వీట్ చేశారు. అడుగడుగునా ట్రాఫిక్ ఇబ్బందుల్లోనే కేసీఆర్ బీఆర్‌కే భవన్‌కి చేరుకున్నారని తెలిపారు.
Kaleshwaram Enquiry | Kaleshwarm Project | Kaleshwaram Report | BRS Party News | Kaleshwaram Latest Updates |