సినీ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటారు. దేశానికి, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, విమర్శించినా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటారు. అయితే, తన పోస్టులతో అప్పుడప్పుడూ వివాదాల్లోకెక్కే ఈ ఫైర్ బ్రాండ్ ఎంపీ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. అదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పై పెట్టిన పోస్టుతో.
భారత్‌తో వాణిజ్య సంబంధాలు, పాకిస్థాన్ భారత్ యుద్ధానికి సీజ్‌ఫైర్‌లాంటి విషయాలపై కొంతకాలంగా ట్రంప్ ప్రవర్తన భిన్నంగా ఉంది. ఈరోజు సైతం భారత్‌లో పెట్టుబడులు వద్దంటూ ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌కు చెప్పానని.. సంచలన కామెంట్లు చేశారు ట్రంప్. అయితే దీనిపై భాజపా నేతలు ఎవరూ స్పందించకున్నా.. ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. పెట్టిన క్షణాల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్దనడంతో ఆ పోస్టును డిలీట్ చేసింది.

ఆ పోస్టులో.. ప్రపంచ నేతగా మోదీకి దక్కుతున్న ఆధరణ చూడలేకే ట్రంప్ రూటు మార్చాడని.. ఈ ప్రేమ తగ్గడానికి కారణాలివే అంటూ ప్రశ్నలు సంధించింది. 1. అమెరికా అధిపతిగా ఉన్నా ప్రపంచంలో మోదీకే గుర్తింపు ఎక్కువ 2. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు.. మోదీ మూడుసార్లు దేశాధినేత 3. ట్రంప్ ఆల్ఫా మేల్ అయితే మోదీ ఆ ఆల్ఫా మేల్‌కి బాప్ అంటూ రాసుకొచ్చింది. అయితే, ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే మరో ట్వీట్ పెడుతూ దీన్ని డిలీట్ చేసింది కంగనా.
బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా ఇప్పుడే కాల్ చేశారు.. ఆయన విన్నపం మేరకు ఆ ట్వీట్ తొలగించాను. అదీ పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ చెప్పుకొచ్చిందీ ఎంపీ కంగనా. దీనిపై నెటిజన్లు కొందరు మద్దతు ఇస్తుంటే.. కొందరు కాస్త అదుపులో ఉండమంటూ తీవ్ర కామెంట్లు చేస్తున్నారు.