
తెలంగాణా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్(BRS Party)లో ఇంటిపోరు రచ్చకెక్కినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha), హరీష్ రావు(Harish Rao) బయటకి వస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే, ఇది కేవలం కాంగ్రెస్ చేస్తున్న కుట్రేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో సహా నేతలంతా తోసిపుచ్చుతూ వస్తున్నారు. కాంగ్రెస్ అవినీతిపై నుంచి దృష్టి మరల్చేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్(KCR)కి రాసిన లేఖలో తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కట్లేదని.. పార్టీకి ఆక్సెస్ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న అనేక విషయాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ సభ(Warangal Sabha)లోనూ కేసీఆర్ స్పీచ్ ఆకట్టుకునేలా లేదంటూ ఆయనకే హితబోధ చేస్తూ లేఖ రాసుకొచ్చారు. దీనిపై కొద్దిరోజులగా రచ్చ సాగుతోంది. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) ఇదే అదనుగా పార్టీలో జరుగుతున్న కుటుంబపోరును ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
శుక్రవారం అమెరికా(America) పర్యటన నుంచి హైదరాబాద్ చేరుకున్న కల్వకుంట్ల కవితకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆమె వచ్చేకంటే రెండు గంటల ముందు నుంచే తెలంగాణ జాగృతి టీం హడావుడి చేసింది. పెద్ద ఎత్తున కార్యకర్తలను అక్కడికి తరలించింది. ఎక్కడా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ రంగు, ఫ్లెక్సీలు కనిపించకపోగా.. సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్న కవితక్క అంటూ బీసీ సంఘాల ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉండగా.. ఆమె బయటకి వస్తుండగా చుట్టూ చేరిన ఆమె అనుచరులు కవితక్క జిందాబాద్.. కవితక్క సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనికి నవ్వుతూ అందరికీ అభివాదం చేస్తూ బయటకి వచ్చారు కవిత.

అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. తన తండ్రి దేవుడని ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవర్టులున్నారని.. వారిని పక్కనపెడితేనే పది కాలాల పాటు పార్టీ చల్లగా ఉంటుందని చెప్పదలుచుకున్నానన్నారు. దీనికి తోడు తనకు పార్టీలో ఎవరిపై ద్వేషం లేదని.. ఎవరిపై ప్రేమ కూడా లేదని చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఆమె పార్టీకి దూరమవుతారనే ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. మరోవైపు తెలంగాణాలో బీసీ సంఘాల నేతలంతా కొంత కాలంగా ఓ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ లోటును కవిత కొత్తపార్టీతో భర్తీ చేయనున్నారని వార్తలొస్తున్నాయి. ఇటీవల హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఇదే విషయంపై చర్చించినట్లు సమాచారం. ఈరోజు నిర్మల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ.. నలుగురున్న కుటుంబంలో గొడవలు సహజమని.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకోసం నిలబడిన వారే అసలైన నాయకులంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అటు బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) సైతం తాను కవిత లేఖ గురించి ముందే చెప్పానన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో(Local Body Elections) కవిత తన సొంత అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారంటూ బాంబు పేల్చారు. భారాస నేత ప్రకాశ్ సైతం ఇదే అంశంపై స్పందిస్తూ.. కవిత ఎవరూ చేయని సాహసం చేశారని.. కేసీఆర్‌కు ఎవరూ నేరుగా సలహాలు ఇవ్వలేరంటూ చెప్పుకొచ్చారు. ఇతర నేతలు లేఖలు రాయడంలో అర్థముందని.. ఓ తండ్రికి సొంత కూతురే లేఖ రాయడం ఏంటని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఏదైనా అనిపిస్తే నేరుగా కలిసో, ఫోన్ చేసే స్వేచ్ఛ కూతురిగా తనకి ఉన్నా.. లేఖ రాశారంటే తీవ్రత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవాలంటూ పలువురు నేతలు చెబుతున్నారు.
ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీలో ముసలాన్ని బలపరుస్తుండగా.. సీఎం (CM Slogans) నినాదాలపై పలువురు ఆ పార్టీ నేతలే తీవ్రంగా స్పందిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ నినాదాలు ఉండవని.. పార్టీని చీల్చే కుట్రలు జరుగుతున్నాయంటున్నారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్‌ల స్పందన కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.