
Hyderabad: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు పంపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో అవినీతి, బ్యారేజీల నిర్మాణం అంశాలపై విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది.
సీఎం కేసీఆర్ తో పాటు కాళేశ్వరం నిర్మాణం సమయంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao), అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంధర్(Eatala)లకు సైతం కమిషన్ నోటీసులు పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే సీనియర్ ఇంజనీర్లు, ఇందులో భాగమైన అధికారులను కమిషన్ విచారించింది. వారిచ్చిన ఆధారాలతో ఈ ముగ్గురు నాయకులను విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్‌ను విచారణకు హాజరుకావాలని కమిషన్‌పేర్కొంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సీపీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్.. కాళేశ్వరంతో సంబంధం ఉన్న అందరినీ విచారించింది. ఈ విచారణల్లో అందరూ సీఎం హయాంలోనే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పడంతో ఇప్పుడు కేసీఆర్‌ను విచారించనున్నారు. దీంతో ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా, అయితే ఏమవుతుందనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.