Job: ఉద్యోగి విధుల్లో చేరకముందే జీతం ఇవ్వాల్సిన పరిస్థితి ఒక అబుదాబి(Abudabi) కంపెనీకి ఎదురైంది. ఉద్యోగానికి ఆఫర్ లెటర్(Offer Letter) ఇచ్చి, ఉద్యోగిని పనిలోకి తీసుకోకపోవడంతో పాటు జీతం కూడా ఇవ్వకపోవడంపై అక్కడి స్థానిక కోర్టు తీవ్రంగా స్పందించింది. కంపెనీ నిర్లక్ష్యానికి తగిన మూల్యాన్ని చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ సంఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది..?
ఇంటర్వ్యూ పూర్తయినా ఉద్యోగం చెప్పిన తేదీకి ఇవ్వకపోవడంతో నష్టపోయానంటూ ఓ ఉద్యోగి అబుదాబీ కోర్టును ఆశ్రయించారు. 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు తన వేతనాన్ని నిలిపివేశారని, కంపెనీ వాగ్దానాలు నిలబెట్టుకోలేదని కోర్టుకు వెల్లడించారు. అతడికి నెలకు 24 వేల దిర్హమ్‌ల (ప్రస్తుతం విలువ ప్రకారం సుమారు రూ. 5.4 లక్షలు) జీతం చెల్లిస్తామని కంపెనీ తమ ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నది. అయితే, ఆఫర్ లెటర్ ఇచ్చినప్పటికీ, ఉద్యోగిని చేర్చుకోడానికి పదేపదే ఆలస్యం చేసింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకెక్కాడు సదరు ఉద్యోగి.
ఉద్యోగి వాదనలు
ఉద్యోగి కోర్టుకు ఇచ్చిన వివరాల ప్రకారం, తను ఉద్యోగం వచ్చిందని తెలియగానే సంతోషించానని.. పనిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కంపెనీ మళ్లీ మళ్లీ తాను జాయిన్ అయ్యే తేదీని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చిందని కోర్టుకు చెప్పాడు సదరు ఉద్యోగి. తాను అన్ని డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత కూడా కంపెనీ పని ప్రారంభించనివ్వలేదని పేర్కొన్నాడు. దీనివల్ల తన జీవనాధారం దెబ్బతిందని కోర్టుకు విన్నవించాడు.

కోర్టు తీర్పు
విచారణలో ఉద్యోగి సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ మెయిల్స్, వాట్సాప్ చాట్స్, ఆఫర్ లెటర్‌లను పరిశీలించిన కోర్టు, జాప్యానికి కంపెనీనే బాధ్యుడిగా తేల్చింది. ఉద్యోగి విధుల్లో చేరకపోయినా, ఆ సమయానికి జీతం చెల్లించాల్సిన బాధ్యత కంపెనీదేనని స్పష్టం చేసింది.
ఫలితంగా, కోర్టు సంస్థను ఉద్యోగికి మొత్తం 1,10,400 దిర్హమ్‌లు (అందుబాటులో ఉన్న మారక రేటు ప్రకారం సుమారు రూ. 25 లక్షలు) చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇది 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు ఉద్యోగికి చెల్లించాల్సిన వేతన మొత్తమని కోర్టు వెల్లడించింది.
కంపెనీపై తీవ్ర ఆగ్రహం
ఈ సందర్భంగా అక్కడి కోర్టు వ్యాఖ్యానిస్తూ, ఉద్యోగులకు ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చకపోవడం, విధుల్లోకి తీసుకోకుండా జీతం నిలిపివేయడం సరైన ప్రవర్తన కాదని తీవ్రంగా ఖండించింది. ఉద్యోగానికి ఆహ్వానించి, చివరికి బాధ్యతలు మరిచిపోయిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది.
అబుదాబి కోర్టు ఇచ్చిన ఈ తీర్పు గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి ఎదురు చూస్తున్న వారందరికీ ఒక మేలుకొలుపు. ఉద్యోగానికి ఆఫర్ ఇచ్చిన సంస్థలు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. ఉద్యోగి హక్కులను కాపాడే విధంగా న్యాయవ్యవస్థ ముందుకు రావడం అభినందనీయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని, ఉద్యోగుల హక్కులను మరింత బలపరిచే దిశగా ఇది ఓ పెద్ద ముందడుగు అని అక్కడి స్థానిక మీడియా విశ్లేషిస్తోంది.