
India-Pakistan: భారత్ పాకిస్థాన్ యుద్ధంపై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్(Jayesh Ranjan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఇతర అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మీడియా రిపోర్టర్ ఒకరు.. దేశంలో యుద్ధ వాతావరణం అలుముకుంది. మన పక్కదేశంతో యుద్ధం జరగబోతోంది. ఒకవేళ ఏదైనా తీవ్రరూపం దాల్చితే మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్న అడిగారు. దీనికి స్పందించిన జయేశ్ రంజన్.. ‘నన్ను అయితే యుద్ధంలో పాల్గొనమని పిలవలేదు.. నిన్ను పిలిచారా.. నేను నా డ్యూటీ చేస్తున్నాను. బార్డర్లో ఉన్న వాళ్లు వాళ్ల డ్యూటీ చేస్తారు.’ అనడంతో అక్కడున్న అందరూ నవ్వారు. తర్వాత ఈ కార్యక్రమం యథావిధిగా సాగుతుంది.. పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ సమాధానం కొనసాగించారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అత్యంత కీలకమైన విషయాన్ని జోక్ చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు.