IPL: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన క్రికెటర్ యష్ దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ జిల్లాలోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. తాను ఐదేళ్లుగా యష్‌తో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నానని, అతను పెళ్లి చేస్తానని ప్రలోభపెట్టి శారీరకంగా, మానసికంగా వేధించాడని యువతి ఆరోపించింది. తనను కాబోయే కోడలంటూ యష్ కుటుంబానికి పరిచయం చేసినట్లు పేర్కొంది. అయితే తర్వాత అతను దూరంగా మారాడని, ఇతర యువతులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదులో వివరించింది.
ఈ విషయమై తాను ప్రశ్నించగా యష్ దయాల్ తనను మానసికంగా వేధించాడని యువతి ఆరోపించింది. జూన్ 14న మహిళా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. తాను పోలీసులకు వాట్సాప్ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియో కాల్స్ స్క్రీన్‌షాట్లు వంటి ఆధారాలు సమర్పించినట్లు తెలిపింది. తనపై జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని, యష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ ఘటనపై స్పందించిన డీసీపీ నిమిష్ పాటిల్ మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు యష్ దయాల్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నదని, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆరోపణలపై యష్ దయాల్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.