IPL 2025: పంజాబ్ ప‌డ‌గొట్టేసింది..!

Share this article

IPL 2025: దిగ్గ‌జ ఆట‌గాళ్ల గైడెన్స్.. బుమ్రా, బోల్ట్ లాంటి భ‌యంక‌ర బౌల‌ర్లు.. స్ట్రాంగ్ బౌలింగ్ లైన‌ప్.. క్వాలిఫ‌య‌ర్ లో 200 స్కోరును ఇప్ప‌టివ‌ర‌కూ చేజార్చుకున్న చ‌రిత్రే లేదు.. వీట‌న్నింటి న‌డుమా ముంబై ఇండియ‌న్స్ ఫైనల్స్ లో అడుగుపెట్ట‌డం లాంఛ‌న‌మే అనుకున్నారంతా. కానీ, పంజాబ్ ప‌డ‌గొట్టేసింది. బుమ్రాతో స‌హా ఏ బౌల‌రుకూ వెర‌వ‌కుండా ముంబైని చిత్తు చేసింది. అన్నింటా జ‌ట్టును ముందుండి న‌డిపించిన‌ శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో 11ఏళ్ల త‌ర్వాత‌ ఫైన‌ల్లో అడుగుపెట్టింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) 203/6 పరుగులు సాధించింది. ఓపెన‌ర్ రోహిత్ శర్మ(Rohit Sharma) 8 పరుగులు చేసి ఔట‌య్యాడు. జానీ బెయిర్ స్టో క్రీజులో నిల‌క‌డగా ఆడుతూ.. 24 బంతుల్లో 38 ప‌రుగులు చేసి ఆట‌ అంచ‌నాలు పెంచాడు. అత‌ని వెంట తిల‌క్ వ‌ర్మ 29 బంతుల్లో 44 పరుగులు చేసి, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు బలం చేకూర్చారు. చివర్లో నమన్ ధీర్ 18 బంతుల్లో 37 పరుగులు చేసి ముంబైకి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు అందించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, విజయ్ కుమార్ వైశాక్ 1, యుజ్వేంద్ర చాహల్ 1, మార్కస్ స్టోయినిస్ 1, కైల్ జెమీసన్ 1 వికెట్ తీశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జ‌ట్టుకు మూడో ఓవ‌ర్లోనే షాక్ త‌గిలింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా వ‌చ్చిన కీల‌క ఆట‌గాడు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (6) స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యాడు. త‌ర్వాత‌ ప్రియాన్ష్ ఆర్య (10 బంతుల్లో 20 రన్స్), జోష్ ఇంగ్లిస్ తో క‌లిసి విధ్వంసం సృష్టించారు. వారిద్ద‌రి ఔట్ తో మ‌ళ్లీ ముంబై చేతిలోకి ఆట వ‌చ్చింద‌నుకునేలోపే.. నేహాల్ వధేరా(29 బంతుల్లో 48 రన్స్)తో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దాడు.

బుమ్రా(Bumra) బౌలింగ్‌లో ఆచీతూచీ ఆడిన పంజాబ్ బ్యాటర్లు.. మిగతా వారి బౌలర్లను ఊచకోత కోశారు. భారీగా రన్స్ సాధించారు. దీంతో పంజాబ్ కింగ్స్ లక్ష్యం దిశగా సాగింది. చివరి వరకూ క్రీజులో ఉన్న కెప్టెన్ అయ్యర్.. జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 రన్స్ నాటౌట్) హాఫ్ సెంచరీతో పంజాబ్ కింగ్స్ మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు.. ఫైనల్‌లో అదే జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది. జూన్ 3న గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *