
Rangareddy: తన చావుకు కారణం ఇందిరమ్మ ఇల్లు(Indiramma Illu) రాకపోవడమేనంటూ చేతిపై రాసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని యాచారం మండలం చింతపట్ట గ్రామానికి చెందిన అశోక్(47) ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొన్న విడుదలైన మొదటి జాబితాలో తనకు ఇల్లు మంజూరైందని చెప్పి.. తర్వాత తుది లబ్దిదారుల జాబితాలో తన పేరు తీసేయడంతో మనస్థాపానికి గురైన అశోక్.. శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. అశోక్ మృతికి ప్రభుత్వమే కారణమని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆ గ్రామస్థులు గ్రామపంచాయితీ ముందు మృతదేహంతో బైఠాయించి ఆందోళనకు దిగారు. అశోక్‌కు ముగ్గురు కుమార్తెలే ఉండటం గమనార్హం.
ఇళ్ల పంపిణీపై విమర్శలు..
యాచారంలో అశోక్ మృతితో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు తెలియకుండా జాబితాలో పేరెలా వచ్చిందంటూ ఓ లబ్ధిదారుడిని కాంగ్రెస్ నాయకుడు కాలితో తన్నాడంటూ కొన్ని వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. జగిత్యాల జిల్లా పరిధిలో ఓ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడి మధ్య వైరంతో లబ్ధిదారుల ఎంపికలో అయోమయంపై వార్తలొచ్చాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ స్థానిక నేతలు చెప్పిందే వేదంగా మారింది. కొందరు మండల స్థాయి నాయకులు ఇళ్లున్నా మళ్లీ దరఖాస్తులు చేసుకోవడం, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద దరఖాస్తులు చేసి తుది జాబితాలో పేర్లు రప్పించుకోవడంపై విమర్శలొస్తున్నాయి. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదోచోట ఇందిరమ్మ కమిటీలు కేవలం డబ్బులు ఇచ్చిన వారు, తమకు అనుయాయులకే మంజూరు చేస్తూ.. అసలు లబ్ధిదారులను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. భారాస(BRS) ప్రభుత్వంలోనూ డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరులో ఇదే జరగ్గా.. ఇప్పుడు స్థానిక కాంగ్రెస్(Congress) నేతలూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.