Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో గాల్లో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానాల్లో భద్రత కోసం ఉంచిన లైఫ్ జాకెట్‌ను దొంగతనం చేస్తూ ఓ ప్రయాణికుడు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే… విమానం ఎగురుతున్న సమయంలో ఓ వ్యక్తి మెల్లగా తన కుర్చీ క్రింద ఉన్న లైఫ్ జాకెట్‌ను తీసుకుని తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఇది గమనించిన మరో ప్రయాణికుడు అతడిని నిలదీశాడు. ఏం చేస్తున్నావ్..? నీ బ్యాగ్ ఓపెన్ చేయ్… నేను అన్నీ చూశా అంటూ బెదిరించాడు. బ్యాగ్‌లో లైఫ్ జాకెట్ కనిపించడంతో దాన్ని తీసేయమని, ఇది చోరీ చేయడం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ మొత్తం ఘటనను అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కంగారు పడుతున్నారు. విమానాల్లో భద్రత కోసం ఉంచిన సామాగ్రిని దొంగిలించడం సరికాదంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న స్పష్టత లేదు. ఇంకా ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా దీనిపై స్పందించలేదు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ వ్యక్తికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. “ఇటీవల ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి జరిగిన ప్రమాదం వల్ల భయంతో లైఫ్ జాకెట్ తీసుకుని ఉంటాడు. అది భూమిపై కాకుండా సముద్రంపై ప్రమాదం జరిగితే ఉపయోగపడేదని భావించి ఉండవచ్చు” అని చెబుతున్నారు.
ఇక మొత్తానికి, భద్రతా పరికరాలపై ఈ విధంగా దొంగతనాలు జరగడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.