నేడు బెంగాల్ ఏం ఆలోచిస్తుందో.. రేపు భారత్ అది చేస్తుందనేది నిన్నటి మాట… తెలంగాణ ఏం ఆచరిస్తుందో భారత దేశం దానిని అనుసరిస్తుందనేది నేటి మాట… కుల గణన ఇందుకు ప్రత్యక్ష ఉదాహారణ.

వ్యాసకర్త ✍️
దూదిపాళ్ల విజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఆర్వో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయించినప్పుడు విపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దానిపై పెదవి విరిచాయి. కానీ అదే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రానున్న జన గణనలో కుల గణన చేపడతామని తాజాగా ప్రకటించింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన కుల గణనయే అందుకు దిక్సూచిగా మారింది. ఒక్క కుల గణనలోనే కాదు తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా వంటివి మున్ముందు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది.
తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రకటించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర ద్వారా దేశ ప్రజల అంతరంగాన్ని, ఆకాంక్షలను, ఆవేదనను ప్రత్యక్షంగా తెలుసుకున్న రాహుల్ గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. కుల గణనను దేశ సామాజిక పరిస్థితులకు ఎక్స్‌రేగా ఆయన అభివర్ణించారు. తాము ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా వెంటనే కుల గణన చేపడతామని రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. జోడో యాత్ర అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి!
రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం మేరకు తెలంగాణలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర శాసనసభ 2024, ఫిబ్రవరి 24న తీర్మానం చేసింది. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ రాజకీయ, కుల సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా వ్యవహరించింది. సర్వే విధి విధానాలు… సర్వే చేపట్టేందుకు మెరుగైన పద్ధతులు పాటించేందుకు కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటించింది. ఇళ్ల నమోదు మొదలు గణన వరకు ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించింది.
1,03,889 మంది ఎన్యుమరేటర్లు (గణకులు) ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రతి పది మంది ఎన్యుమరేటర్లపై పర్యవేక్షణకు ఒక సూపర్ వైజర్‌ను నియమించారు. 50 రోజుల పాటు సాగిన సర్వేలో రాష్ట్రంలోని 1,15,71,457 ఇళ్లకు గానూ 1,12,15,134 ఇళ్ల సర్వే పూర్తి చేశారు. సర్వేలో పాల్గొనడానికి ఇష్టపడని, ఆ సమయంలో అందుబాటులో లేని వారి కోసం ఆన్‌లైన్ ద్వారా రెండో విడత సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రెండో విడతలో 21, 715 కుటుంబాల సర్వే పూర్తయింది. మొత్తంగా రాష్ట్రంలోని 97.10 శాతం ఇళ్ల సర్వే పూర్తి చేసి మొత్తం తెలంగాణ జనాభా 3,55,50,759గా సర్వేలో తేల్చారు. నియమనిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు పూర్తి పారదర్శకంగా వ్యవహరించి రాష్ట్రంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల లెక్కలను తెలంగాణ ప్రభుత్వం తేల్చింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ రాజకీయ, కుల సర్వేను పారదర్శకంగా, లోటుపాట్లు లేకుండా నిర్వహించింది. సర్వేలో వెల్లడైన గణాంకాల ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంచుతూ శాసనసభలో తీర్మానాలు చేసింది. కుల గణన చేపట్టడంతో పాటు వాటిని విధాన పరమైన నిర్ణయాలకు ప్రాతిపదిక చేసుకుంటుండంతో తెలంగాణ ప్రజల నుంచి సానుకూలత వెల్లువెత్తడం ప్రారంభమైంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఈ అంశంలో విమర్శలు గుప్పించిన వర్గాలు సైతం నెమ్మదిగా మౌనం వహించడం ప్రారంభించాయి.
కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ, చూపిన అంకితభావం, గణాంకాల ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. రాష్ట్రంలో కుల గణన చేయడంతో పాటు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నినదించారు. జంతర్‌మంతర్ లో జరిగిన దీక్షకు బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంలో సైతం కదలిక వచ్చింది. ఫలితంగా రానున్న జన గణనలో కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తట్టి లేపిన తెలంగాణ!
దేశంలో జనాభా లెక్కలకు వందేళ్లపైన చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో 1872లో తొలిసారిగా జన గణన చేపట్టారు. పూర్తి స్థాయి జన గణన మాత్రం 1881లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జన గణన చేపడుతున్నారు.. బ్రిటిష్ హయాంలో జన గణనలో భాగంగా కుల గణన చేపట్టేవారు.. 1931లో ఆఖరిసారిగా జన గణనలో కుల గణన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లో తొలిసారి జనాభా లెక్కలు చేప్టటారు. 2011 వరకు ప్రతి పదేళ్లకోసారి ఈ జన గణన సాగింది.
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. గత పదకొండేళ్లుగా ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉన్నా కరోనా వైరస్‌ను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం వాటిని పక్కనపెట్టింది. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనే 2020లో బీహార్, 2021లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు కేంద్ర మంత్రులంతా బహిరంగ సభల్లో పాల్గొన్నారు… 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో అక్కడ కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. షంషేర్ గంజ్, జాంగీపూర్, ఖర్దహా నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు కొవిడ్‌తో మరణించడంతో ఆయా నియోజకవర్గాలకు ఎన్నికలు వాయిదా వేశారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రయోజనాలకే బీజేపీ పెద్ద పీట వేసింది. కానీ దేశంలో వివిధ ప్రణాళికల రూపకల్పన, నిధుల కేటాయింపు వంటి కీలకాంశాలకు మూలమైన జన గణనపై బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణలో కుల గణన చేపట్టిన తర్వాత ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపైన పడడం… ఈ ఏడాది బీహార్, వచ్చే ఏడాది కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా జన గణనలో కుల గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో కుల గణన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడం… అధికారుల బృందాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించడం.. గణన సమయంలో ఏకంగా 8 సార్లు సమీక్ష నిర్వహించారు. విధివిధానాల రూపకల్పనతో పాటు గణన ప్రతి దశలోనూ సమర్థ మార్గదర్శకత్వం వహించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంతో పాటు కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న స్పష్టత, దాని ద్వారా ఆయా వర్గాలకు చేకూరే ప్రయోజనాల విషయంలో పూర్తి చిత్తశుద్ధి ఉన్నందునే ఈ ప్రక్రియ విజయవంతమైంది. జన గణనలో కుల గణన చేపడతామని కేంద్ర ప్రకటించిన తర్వాత రాజకీయ విభేదాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని స్వాగతించారు. అదే సమయంలో ఈ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కసరత్తును, అనుసరించిన విధానాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
కేంద్ర ప్రభుత్వానికి కుల గణనపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు తెలంగాణ మోడల్‌ను అధ్యయనం చేయాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచిని స్వీకరిస్తున్నామనే విషయం ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ‘‘గొప్ప ఆలోచనలు అన్ని వైపులా నుంచి రానివ్వాలి’’ అని రుగ్వేదం చెబుతోంది.. దానిని కేంద్ర ప్రభుత్వం అనుసరించాలి.