
ఐఏఎస్.. పేరు వెనక ఈ మూడక్షరాలు ఎంతోమంది భారతీయ యువతీ యువకుల కల. ఎంత కష్టమైనా ఆ సీటుపై కూర్చోవాలనే తపనతోనే ఎన్నేళ్లయినా అన్నీ వదులుకుని ఒకే లక్ష్యంగా కష్టపడుతుంటారు. సాధించి ఈ అత్యున్నత సర్వీసు విలువల్ని కాపాడేందుకు కృషి చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నా.. సర్వీసు ప్రతిష్టను దిగజార్చేందుకు వెంపర్లాడేవాళ్లూ లేకపోలేదు. మెప్పు కోసం, పదవుల కోసం తమ భక్తిని వివిధ రూపాల్లో చాటుకునే అధికారులు, కాళ్లబేరాలకూ దిగే అధికారులు తెలంగాణాలో తరచూ కనిపిస్తున్నారు.
గతంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి వెంకట్ రామిరెడ్డి అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వివాదాస్పదమయ్యారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే పార్టీ నుంచి MPగా పోటీ చేశారు. ఇప్పుడు అదే జాబితాలో చేరారు గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్(IAS Sharath). సోమవారం నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగిన ఇందిరా సౌర గిరి జల వికాసం కార్యక్రమంలో సభావేధిక మీదే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) కాళ్లు మొక్కి వివాదంలోకెక్కారు.
గతంలోనూ వివాదాలు..!
డాక్టర్ ఏ శరత్‌ది ఓ మధ్య తరగతి గిరిజన కుటుంబం. ఐఏఎస్‌గా ఎన్నో కీలక నిర్ణయాల్లో భాగమైన ఆయన గతంలోనూ పలు వివాదాలకు కేంద్రబిందువయ్యారు. గతంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్‌గా గుడిమల్కాపూర్ మార్కెట్ విషయంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోర్టు విచారణ ఎదుర్కొన్నారు. గతంలో జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ కాళ్లు మొక్కి మరోసారి వివాదాల్లో నిలిచారు. అత్యున్నత సర్వీసులో ఉండి సీఎం కాళ్లు మొక్కడమేంటంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.