13వ ఏట ఘనంగా వేడుకలు.. హాజరైన వేలాది ఐటీ ఉద్యోగులు..
Hyderabad: తెలంగాణ ఐటీ అసోసియేషన్(టీటా) ఆధ్వర్యంలో, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన 13వ ఐటీ బోనాల ఉత్సవం ఆదివారం ఐటీ కారిడార్‌లో వైభవంగా జరిగింది. ప్రముఖ సంస్థల నుంచి వేలాదిగా ఐటీ ఉద్యోగులు, జానపద కళాకారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని టీటా గ్లోబల్ అధ్యక్షుడు శ్రీ సందీప్ కుమార్ మక్తాల కుటుంబంతో కలిసి పెద్దమ్మ తల్లికి చీర, ఒడిబియ్యం సమర్పించి ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రపంచ ఐటీ రాజధానిగా ఎదగాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు. బోనాల ఊరేగింపు శిల్పకళా వేదిక వద్ద ప్రారంభమై, గూగుల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చిన్న పెద్దమ్మ ఆలయంలో ముగిసింది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ తదితర ప్రఖ్యాత ఐటీ సంస్థల నుండి వెయ్యికి పైగా ఉద్యోగులు, 21 బోనాలు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. పోతురాజుల నృత్యాలు, ఒగ్గు డోలు, శివసత్తులు, గుస్సాడి కళాకారుల ప్రదర్శనతో ఐటీ కారిడార్ హోరెత్తింది.

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, శాసన మండలి ఉప సభాపతి బండ ప్రకాష్, కార్పొరేటర్ సామల హేమ, సామాజిక సేవకులు చికోటి ప్రవీణ్, డాక్టర్ జ్యోతి రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లాడుతూ.. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు.. మన భూమికి, భక్తికి, సంస్కృతికి మనం తెలిపే కృతజ్ఞత అన్నారు. ఆధునిక సాంకేతికతలు ఎన్ని వచ్చినా సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోవద్దనే 13 ఏళ్లుగా ఈ వేడుకలు టీటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో తరం మారుతున్నప్పటికీ, సమాజంలోని సాంకేతిక వర్గాలు తమ మూలాల వైపు తిరిగి చూడాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఉత్సవం బలంగా చెబుతోందన్నారు.