Hyderabad: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో ఓ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. మెట్రో పిల్లర్ నెంబర్-136 సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్‌లో పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పెట్రోల్ బంక్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. (Hyderabad Petrol Bunk)
ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను వేగంగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ప్రాంతాన్ని ఖాళీ చేయించి, స్థానికులను అక్కడి నుంచి దూరంగా పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అడుగడుగునా నిర్లక్ష్యమే..!
ఈ ఘటన మరోసారి హైదరాబాద్‌లోని పెట్రోల్ బంక్‌ల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ స్థాయిలో ప్రజల జీవితాలకు నిత్యం ముప్పు ఉన్నా, ఎందుకు పెట్రోల్ బంక్‌లలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించట్లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పెట్రోల్ ట్యాంకర్లు, నిల్వ ఉన్నచోట అగ్గి రాజేసే పనులేం చేయకూడదు.. కానీ, అత్తాపూర్‌లోని ఈ బంక్‌లో వెల్డింగ్ వంటి ప్రమాదకర పనులను పెట్రోల్ ట్యాంక్ పక్కనే చేయడమంటే నిబంధనల ఉల్లంఘనతో పాటు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతుంది.

చట్టాలు పట్టవా..?
పెట్రోల్ బంక్‌లో వెల్డింగ్, కటింగ్, స్పార్క్ ఇచ్చే పనులు చేయడం భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం పూర్తిగా నిషేధం. పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నియమాలు-2002, ఎక్స్‌ప్లోసివ్స్ రూల్స్-2008 ప్రకారం పెట్రోల్ బంక్‌లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. మంటలు, నిప్పురవ్వలు చెలరేగే ఏ పనీ చేయకూడదు. దీనికి తోడు వినియోగదారులు సహా అందులో పనిచేసే వారూ మొబైల్ ఫోన్ వాడకూడదు. కానీ, హైదరాబాద్‌లో ఏ పెట్రోల్ బంక్‌లోనూ అది కనిపించదు. ఫోన్ మాట్లాడుతూనే పెట్రోల్ కొట్టేవాళ్లు, కొట్టించుకునేవాళ్లూ ప్రతీ బంక్‌లోనూ కనిపిస్తారు. ఇంజిన్ ఆఫ్ చేయకపోవడం వలన కూడా పెద్ద ప్రమాదాలు జరగవచ్చు అని స్పష్టంగా నిబంధనలు చెబుతున్నా వాటిని పాటించకపోవడం గమనార్హం.
పెట్రోల్ బంక్‌లలో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ఎలక్ట్రికల్, వెల్డింగ్ పనులు బహిరంగ ప్రదేశంలో చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. ఇలాంటి పనులు చేయాలంటే, పెట్రోల్ నిల్వలు ఖాళీ చేయాలి, పక్కా భద్రతా చర్యలు తీసుకోవాలి, సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ హైదరాబాద్‌లోని చాలా పెట్రోల్ బంక్‌లలో ఈ మార్గదర్శకాలు కేవలం కాగితాల్లో మాత్రమే మిగిలిపోతున్నాయి. అధికారుల నిఘా లేకపోవడం, బంక్ యజమానుల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసివచ్చి ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ప్రతి ప్రమాదం తర్వాత కొద్ది రోజులు అధికారుల దృష్టి అక్కడే ఉంటుంది కానీ, తర్వాత మళ్లీ నిర్లక్ష్యం యథావిధిగా కొనసాగుతుంది. ఇలాంటి ప్రమాదాలు తీవ్రతరమై ప్రాణాల మీదికి రాకముందే కఠిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.