
Hyderabad: దుబాయ్‌లో(Dubai) జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ అవార్డ్స్ – 2025 కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసులకు విశేష స్థానం దక్కింది. యాంటీ నార్కొటిక్స్(Anti Narcotics) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఐపీఎస్ ప్రథమ బహుమతి దక్కించుకున్నారు. ఈ పురస్కారం అందుకునేందుకు మే 15న దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగే వేడుకలకు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆయనకు ఆహ్వానం అందింది.
గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణాలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎక్కడికక్కడ డ్రగ్ పెడ్లర్ల అరెస్టులతో పాటు సరఫరాకు మూలాలను వెతికి తుంచేస్తున్నారు. కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెచ్-న్యూ (H New) (నార్కటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్) ను ప్రారంభించి మాదక ద్రవ్యాల విక్రయ, సరఫరాదారుల ఆటకట్టిస్తున్నారు.
ఇదే ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ పోలీసులకు ప్రథమ స్థానం కల్పించింది. ఇప్పటి వరకూ జరిగిన అరెస్టులు, సామాజిక భాగస్వామ్యం, ఇతర ఏజెన్సీలతో సమన్వయం, క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పు తదితర అంశాలను సమగ్రంగా విశ్లేషించిన అంతర్జాతీయ నిపుణుల బృందం హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ప్రథమ విజేతగా ప్రకటించింది. ఈ ఎంపిక సమయంలో నిర్వహించే ఓ గంట వీడియో ఇంటర్వ్యూలో సైతం సీవీ ఆనంద్(CV Anand IPS) ప్యానల్ మెంబర్‌లను ఆకట్టుకున్నారని కమిటీ తెలిపింది. ఏటా ప్రపంచ ఉత్తమ పోలీసులను గౌరవించేందుకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని దేశాలు, ప్రధాన నగరాల పోలీస్ విభాగాలు వివిధ పోటీల్లో పాల్గొంటాయి. దీనిపై కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. ప్రతీ ఒక్కరి సహకారంతో ఇది సాధ్యమైందని.. ప్రపంచ వేధికపై ప్రథమ స్థానం దక్కడం గర్వంగా ఉందన్నారు.