India-Pakistan: పాకిస్థాన్-భారత్ మధ్య రేగిన యుద్ధపు మంటల సెగ హైదరాబాద్ ను తాకుతోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చర్యలకు ప్రతిస్పందనగా.. పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. భారత్ విమానాలు తమ భూభాగం మీదుగా వెళ్లేది లేదని స్పష్టం చేసింది. ఇది ఇప్పుడు హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా టేకాఫ్ అయ్యే విమానాలకు దూరభారంగా మారింది. ఇక్కడి నుంచి దుబాయ్, అమెరికా, బ్రిటన్, జర్మనీ సహ యూరోప్ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణీకులపై తీవ్ర భారం పడుతోంది. పెద్ద ఎత్తున టిక్కెట్ ధరలు పెరగడంతో పాటు ఒక్కో స్థానానికి చేరుకునేందుకు అదనంగా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది.

ఏప్రిల్ 24 సాయంత్రం 6గంటల నుంచి పాక్ గగనతలం మీదుగా వెళ్లే భారత విమానాలపై నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో పాక్ మీదుగా హైదరాబాద్ నుంచి వెళ్లే విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపుతున్నాయి. అయితే, పాక్(Pak) నిర్ణయం తర్వాత బుధవారం అర్ధరాత్రి నుంచి మే 23 వరకు మనమూ ఆ మార్గాల్లో వెళ్లేది లేదని భారత కేంద్ర ప్రభుత్వమూ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ తదితర సంస్థలు షెడ్యూళ్లు మార్చినట్లు ప్రయాణీకులకు సందేశాలు పంపుతున్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా దుబాయ్‌కి ఎమిరేట్స్(Emirates), ఇండిగో(Indigo), ఎయిర్ ఇండియా(Air India) రోజూ సర్వీసులను నడుపుతున్నాయి. ప్రతి విమానం 90శాతం ఆక్యుపెన్సీతో వెళ్తుందని.. దీంతో తప్పనిసరిగా దారి మళ్లింపు చేసి మరీ నడుపుతున్నామని ఆ సంస్థలు చెబుతున్నాయి.
యూరోప్(Europe) దేశాలకు వెళ్లే ప్రయాణీకులపై సైతం ఛార్జీల భారం పడుతోంది. జర్మనీ(Germany) వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు సగటున 12 నుంచి 16గంటల పాటు ప్రయాణిస్తుండగా.. ఇతర దేశాల్లో రెండూ, మూడు స్టాప్‌లతో విమాన సర్వీసులను నడిపిస్తున్నాయి. ఈ రూట్‌లో సగటు రూ.35-38 వేలు ఉండే ఎకానమీ టిక్కెట్టు ధర అమాంతం రూ.55-75వేల దాకా ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తోంది.