HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ట్రైలర్ గురువారం విడుదలైంది. ఈ ట్రైలర్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొని అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. రెండు నిమిషాల 55 సెకన్ల నిడివితో వచ్చిన ఈ పవర్ఫుల్ ట్రైలర్ పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ ట్రైలర్‌లో ఔరంగజేబు పాలన కాలంలో హరిహర వీరమల్లు అనే తెలుగు యువకుడు ఎలా ఢిల్లీ సింహాసనానికి సవాల్ విసిరాడన్న కథాంశాన్ని ఆసక్తికరంగా చూపించారు. కోహినూర్ వజ్రం చుట్టూ కథ తిరుగుతుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని డైలాగులు థియేటర్లలో హంగామా సృష్టించాయి. కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయి. “ఇప్పటి దాక మేకలు తినే పులిని మీరు చూసి ఉంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు” అనే డైలాగ్ ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని కలిగించగా, “నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు” అనే డైలాగ్ ఆయన రాజకీయ ప్రత్యర్థులకు పంచ్‌లా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే “వినాలి… వీరమల్లు చెప్పింది వినాలి” అనే డైలాగ్ పవర్‌ఫుల్ గా ట్రైలర్‌కి ముగింపు పలికింది.

ట్రైలర్ మొత్తం చూస్తుంటే ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్స్, సెట్స్‌కి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో స్పష్టంగా తెలుస్తోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నాడు. తొలుత క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆయన తప్పుకోగా యువ దర్శకుడు జ్యోతికృష్ణ చేతికి వచ్చింది. ఎ. దయాకర్ రావు నిర్మించగా, ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందించారు. పీరియాడిక్ డ్రామాలకు కీరవాణి అందించే సంగీతం ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈనెల 24న తెరపైకి..
ఈ చిత్రం జూలై 24న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయంగా కీలక సమయంలో విడుదలవుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ గురువారం కళ్యాణ్ కల్ట్ అభిమానులకు దక్కిన ఈ పవర్ ప్యాక్డ్ గిఫ్ట్ చిరకాలం గుర్తుండిపోతుందనేది వాస్తవం. ఇదిలా ఉండగా ఓజీ అప్‌డేట్స్ కూడా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టిన పవన్.. పూర్తి స్థాయి సినిమాలు చేయలేదు. చేసిన సినిమాలూ ఫ్యాన్స్‌కు సంతృప్తినివ్వలేదు. చాలాకాలం తర్వాత వస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల మీద సినీ అభిమానులు, కళ్యాణ్ అభిమానులు భారీ ఆశలతో ఉన్నారు.