
Hyderabad: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. రెండేళ్లుగా సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు పవన్. 2023లో వచ్చిన బ్రో సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మొదలుపెట్టిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు ఎన్నికలతో ఆగిపోయాయి. ఇక ఎన్నికల్లో జనసేన 100శాతం స్ట్రైక్ రేట్ సాధించి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టడంతో ఇక ఇప్పట్లో సినిమాలు కష్టమేనన్న వాదనలూ వినిపించాయి. మార్చి 28న విడుదల అవ్వాల్సిన వీరమల్లు.. పవన్ నటించాల్సిన కొన్నికీలక యాక్షన్ సన్నివేశాల వల్ల ఆగిపోయింది. వీటికి మంగళవారంతో ఫుల్ స్టాప్ పెట్టారు పవన్. సోమవారం ఉదయం నుంచి షూటింగ్లో పాల్గొన్న ఆయన.. మంగళవారం రాత్రికి మిగతా సీన్లన్నీ పూర్తిచేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత బృందం సామాజిక మాధ్యమాల్లో పలు ఫొటోలు పంచుకుంది. చిత్రీకరణ పూర్తయిందని.. త్వరలోనే థియేటర్లలో ఆయన విన్యాసాలు ఆకట్టుకుంటాయని తెలిపింది.

స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరిట వస్తున్న ఈ పార్ట్-1లో నిధి అగర్వాల్ పవన్ సరసన నటిస్తున్నారు. బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగాసూర్య బ్యానర్లో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కొంత భాగం జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించగా.. మిగతాది జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు.