కొలంబియాలో సంచలనాత్మక ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సెనేటర్‌గా ఉన్న ప్రముఖ నాయకుడు, రాబోయే అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్న మిగ్యుల్ ఉరిబ్ టర్బే (39)పై బహిరంగంగా కాల్పులు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఈ ఘటన బొగోటా నగరంలోని ఓ పార్కులో జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా జరిగింది. వందలాది మంది అభిమానుల మధ్య మిగ్యుల్ టర్బే ప్రసంగిస్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుండి ఓ గుర్తు తెలియని దుండగుడు తుపాకితో ఆయన్ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. ఆయన తలను టార్గెట్ చేస్తూ ఈ కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై మిగ్యుల్‌ను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తక్షణమే తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని బొగోటా నగర మేయర్ కార్లోస్ గాలన్ అధికారికంగా ధృవీకరించారు.
ఇక ఈ దాడిని నిర్వహించిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను వెలికితీయడానికి విచారణ కొనసాగుతోంది. దాడి వెనుక ఎలాంటి కుట్ర ఉందా? ఏయే వ్యక్తులు ఇందులో భాగస్వాములయ్యారు? అనే కోణంలో పోలీసు శాఖ పరిశీలన జరుపుతోంది.
ఈ ఘటనపై మిగ్యుల్ టర్బే పార్టీ కన్జర్వేటివ్ డెమొక్రటిక్ తీవ్రంగా స్పందించింది. “ఇది కేవలం మిగ్యుల్‌పై జరిగిన వ్యక్తిగత దాడి కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావించాలి,” అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధులు ప్రకటించారు. ఈ సంఘటనను ఖండిస్తూ తీవ్రంగా విభత్సించామని వెల్లడించారు.
ఇక కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా ఈ ఘటనపై స్పందించారు. “మిగ్యుల్ ఉరిబ్ టర్బే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రాజకీయ వ్యత్యాసాలకతీతంగా మనం ప్రజాస్వామ్యాన్ని, శాంతిని కాపాడుకోవాలి,” అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ ఘటనకు నేపథ్యం రాబోయే కొలంబియా అధ్యక్ష ఎన్నికలు. 2026 ప్రారంభంలో జరగనున్న ఈ ఎన్నికల్లో మిగ్యుల్ ఉరిబ్ టర్బే కన్జర్వేటివ్ డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తాజా కాల్పుల ఘటనతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఓ జర్నలిస్టు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన టర్బే అక్కడ ఓ సంచలనం. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాడనే ప్రచారం నేపథ్యంలో ఆయనపై ఈ దాడి చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌పైనా ఇలాంటి దాడే జరగింది. ఆ తర్వాత భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ట్రంప్.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు, సామాన్య ప్రజలు, మానవ హక్కుల సంఘాలు కూడా ఈ దాడిని ఖండిస్తూ ప్రభుత్వాన్ని శాంతి భద్రతలపై మరింత దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Columbia President, Attack on president candidate, International news,