
Assam: పౌరుల రక్షణ దృష్ట్యా అస్సాం సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని పలు మారుమూల ప్రాంతాల్లో అభద్రతతో జీవిస్తున్న స్థానిక పౌరులకు ఆయుధ లైసెన్సు(Gun License)లు ఇవ్వనున్నామంటూ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Bishwa sharma) ప్రకటించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అస్సాం చాలా సెన్సిటివ్ రాష్ట్రమన్నారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అభద్రతా భావంతో బతుకుతున్నారన్నారు. చాలా కాలంగా వారు ఆయుధాల లైసెన్సు కోసం అభ్యర్థిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కేబినేట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ముప్పు ఉందని భావించిన, అటవీ ప్రాంతాల్లో నివసించే స్థానికులు, ప్రభుత్వం నిర్దేశించిన పలు అర్హతలు కలిగి ఉన్న వారికి ఇకపై ఆయుధాలు వాడే స్వేచ్ఛను ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఆ రాష్ట్రంలోని ధుబ్రి, మోరిగావ్, బార్‌పేట, సల్మారా, మాంకాచార్ వంటి ప్రాంతాలను ఇన్‌సెక్యుర్డ్ కేటగిరిలో గుర్తించినట్లు సీఎం హిమంత ప్రకటించారు. ఈ ప్రాంతంలో అస్సామీలు మైనార్టీలుగా ఉన్నారని.. వలస వచ్చిన వారు మెజారిటీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అస్సాంలోని పలు ప్రాంతాలకు రోహింగ్యాల నుంచి ముప్పు ఉందని పలువురు మంత్రులు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.