మహాత్మా గాంధీ మ‌న‌వ‌రాలికి ఏడేళ్ల జైలు శిక్ష‌

Mahatma Gandhi Great Grand Daughter jail

Share this article

మహాత్మా గాంధీ మనుమరాలు ఆషిష్ లత రామ్‌గోబిన్ (56) ఓ మోసం కేసులో దోషిగా నిర్ధార‌ణ అవ‌డంతో దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం ఆమె అప్పీల్ హక్కును కూడా తిరస్కరించింది. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గాంధీ వార‌సురాలిగా..
లత రామ్‌గోబిన్ తనకు తాను హక్కుల కార్యకర్తగా, గాంధీ సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తిగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఏళ్లుగా గాంధీ కుటుంబ త‌ర్వాతి త‌రం గుజ‌రాత్‌ను వ‌దిలి ద‌క్షిణాఫ్రికాలో స్థిర‌ప‌డ్డారు. అక్క‌డే వివిధ వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం అరెస్టైన ల‌త‌.. మ‌హాత్మ‌ గాంధీ మనుమరాలు మాత్రమే కాదు, ఆమె ప్రముఖ హక్కుల కార్యకర్త మేవా రామ్‌గోబిన్ కుమార్తె కూడా కావడం ఈ ఘటనను మరింత చర్చనీయాంశం చేసింది.

మోసం ఇలా..
2015లో వ్యాపారవేత్త ఎస్.ఆర్. మహరాజ్‌కు ఆమె పరిచయం అయ్యారు. మహరాజ్ దక్షిణాఫ్రికాలో ప్రముఖ వస్త్ర, పాదరక్షల వ్యాపారి. ఇతర వ్యాపారాలకు నిధులు సమకూర్చడం, వాటిపై లాభం పొందడం చేస్తుంటారు. ఇదే అవ‌కాశంగా లత త‌న వ్యాపారానికి సాయం కావాలంటూ మహరాజ్‌ను నమ్మబలికారు.

“దక్షిణాఫ్రికాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి గ్రూప్ కోసం ఇండియా నుంచి లెనిన్ (ఆసుపత్రుల్లో వాడే వస్త్రాలు) దిగుమతి చేయాలంటే పెద్ద పెట్టుబడి అవసరం. కస్టమ్స్ క్లియరెన్స్, దిగుమతి సుంకం కోసం తక్షణ పెట్టుబడి కావాలి. మీరు సహాయం చేస్తే లాభంలో వాటా ఇస్తా” అంటూ ఆమె చెప్పిన మాటలు మహరాజ్‌ను నమ్మించాయి.

మహరాజ్ లతపై నమ్మకంతో పెట్టుబడి సమకూర్చారు. కానీ కొంతకాలానికే ఎలాంటి సరుకులు దిగుమతి చేయలేదన్న విషయం బయటపడింది. పరిశీలించగా లత రామ్‌గోబిన్ కేవలం మోసం చేయడానికి ఈ క‌థ సృష్టించిన‌ట్లు స్పష్టమైంది. డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని అడ‌గ్గా.. ఆమె భిన్నంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో వెంటనే మహరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచార‌ణ‌లో లత రామ్‌గోబిన్ భారతదేశం నుంచి ఎలాంటి సరుకులు దిగుమతి చేయలేదని స్ప‌ష్ట‌మైంది. కోర్టులో విచారణలు సాగగా ఆమె చేసిన మోసం రుజువయ్యింది. దాంతో డర్బన్ కోర్టు ఆమెకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కోర్టు నిరాకరించింది.

గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా మోసానికి పాల్పడటంతో ద‌క్షిణాఫ్రికాలోని భార‌త క‌మ్యునిటీ ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తోంది. అయితే, ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా న్యాయం అందరిపైనా ఒకేలా ఉండాలని కోర్టు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. హక్కుల కోసం పోరాడే కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఇలా మోసం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

వ్యక్తిగత జీవితంలో ఎవరి వారసత్వం ఎంతటి గొప్పదైనా, నైతిక విలువలు త‌ప్పితే.. ఇలాంటివే ఘ‌ట‌న‌లే ఎదుర‌వుతాయ‌ని మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *