Formula-E: తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఫార్ములా-ఈ రేస్ కేసులో మళ్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నందినగర్‌లోని నివాసానికి చేరుకున్న ఆయన.. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య చర్చలు జరిపిన కేటీఆర్ అక్కడి నుంచి ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు.
కేసు నేపథ్యం..
2023లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఈవెంట్ ఫార్ములా ఈ రేస్‌ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించి రూ.44 కోట్ల మేర నిధులను హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ద్వారా విడుదల చేసిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని తిరిగి పరిశీలిస్తూ, నిధుల విడుదలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో సహా పలువురు అధికారులు, సంస్థలపై కేసు నమోదు చేసింది.
ఏసీబీ దర్యాప్తులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో నిధులు విడుదల చేశారని, నియమాలు, అనుమతులు లేకుండానే ఆర్థిక లావాదేవీలు జరిగాయని తేలింది. కేటీఆర్ అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా, నిధుల విడుదలకు ఆయన ప్రమేయం ఉందని ఏసీబీ అనుమానిస్తోంది.
ఇప్పటి వరకు ఏం జరిగింది?
జనవరిలో కేటీఆర్ తొలిసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ రోజు సుమారు ఆరు గంటల పాటు ఆయనను విచారించారు. అనంతరం మే 26న మరోసారి విచారణకు పిలిపించినా, వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా హాజరుకాలేదని తెలిపిన కేటీఆర్‌కు తాజాగా జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ తాజా నోటీసులు జారీ చేసింది.
ఈ రోజు ఉదయం కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై వివరాలు చర్చించిన అనంతరం ఏసీబీ కార్యాలయానికి వెళ్లేందుకు నందినగర్ నివాసం నుంచి బయలుదేరారు. ఆయన ప్రయాణ మార్గంలో పోలీస్ విభాగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, 1500 మందికిపైగా పోలీసులను మోహరించారు. అనుమతి లేని వ్యక్తులను కార్యాలయ పరిసరాలకు అనుమతించకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
కేటీఆర్ స్పందన
ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన కేటీఆర్, “ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ వేధింపులే. నేను ఎటువంటి తప్పూ చేయలేదు. నిధులు ప్రభుత్వం తరఫున అధికారికంగా విడుదలయ్యాయి. ఇవాళ కూడా ఆ డబ్బు లండన్‌లోని సంస్థ ఖాతాలోనే ఉంది” అని వివరించారు. “మీరు చేసే విచారణలు, నోటీసులు, రాజకీయ హింసలు నన్ను భయపెట్టలేవు. నిజం ఎప్పుడూ గెలుస్తుంది” అని కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు.
ఏం జరగబోతోంది..?
కేటీఆర్ పై ప్రస్తుతం మూడో విడత విచారణ జరుగనుండగా, ఇందులో నుంచి ఏసీబీ తదుపరి చర్యలు, ఛార్జిషీటు, తదితర అంశాలపై స్పష్టత రానుంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు, కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోరుకు దారితీస్తోంది. ఇప్పటికే కీలక వ్యక్తులు, అధికారులను విచారించిన ఏసీబీ తుదిగా కేటీఆర్‌ను ఈరోజు విచారించనుంది. అయితే, పంచాయతీ ఎన్నికలకు ముందే కేటీఆర్‌ను అరెస్టు చేస్తారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.
మరోవైపు పంచాయతీ ఎన్నికలు ఇంకో వారంలో జరగనుండగా.. అరెస్టు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పెరుగుతుందా అన్న కోణంలోనూ అధికార పార్టీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కీలక విషయాలు బయటికొస్తున్నాయి. భాజపా ఎంపీలు, కాంగ్రెస్ కీలక నేతల ఫోన్ల సంభాషణ పూర్తిగా రికార్డు చేశారని విచారణ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ కేసుల్లో కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ ప్రతీ సభలో అరెస్టు చేస్తామని చెప్పడం.. ఇప్పటివరకూ ఎలాంటి ముందడుగు లేకపోవడంపైనా పార్టీపై విశ్వాసం తగ్గుతుందని కొందరు నేతలు చెబుతున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు ముందే పలువురు కీలక నేతల అరెస్టు తప్పేట్టు లేదని అంచనా.
ఇదిలా ఉండగా.. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నాయి. ఆయనకు మద్దతుగా ప్రధాన నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.