Encounter: తమిళనాడులోని తిరుప్పూరు జిల్లా కుడిమంగళం స్పెషల్ సబ్‌ఇన్స్‌పెక్టర్ షణ్ముగవేల్ హత్యకేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి తాగిన మత్తులో కూలీలు మూర్తి(60), ఆయన కుమారులు తంగపాండి(25), మణికంఠన్(30) గొడవ పడ్డారు.
ఈ ఘర్షణలో మూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో స్థానిక ఎస్సై ఎస్సై షణ్ముగవేల్.. తన డ్రైవర్‌తో వెళ్లి ఈ గొడవను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త వాగ్వివాదం చోటుచేసుకోవడంతో ముగ్గురూ కలిసి ఎస్సైపై దాడి చేసి చంపేశారు. ఎస్సైపై దాడి అనంతరం ముగ్గురు నిందితులూ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము మణికంఠన్‌ను ఉడుమలైపేటలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్సై షణ్ముగవేల్‌పై దాడికి ఉపయోగించిన వేటకొడవలిని స్వాధీనం చేసుకునేందుకు గురువారం వేకువజామున అతడిని హత్యాస్థలానికి తీసుకెళ్లారు.
చిక్కానత్తు ఉప్పువాగు ఒడ్డున వేటకొడవలిని స్వాధీనం చేసుకుంటుండగా.. మణికంఠన్ పోలీసులపై అదే ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎస్సై శరవణకుమార్ కుడిచేతికి గాయమైంది. దీంతో ఆత్మరక్షణ కోసం మణికంఠన్‌పై సీఐ కాల్పులు జరపగా.. అతడు గాయపడ్డాడు. ఉడుమలపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మణికంఠన్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఎస్సై శరవణకుమార్‌కు అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.