Elon Musk: ఎలాన్ మస్క్.. సంచలనాలకు కేరాఫ్ ఈ పేరు. అటు వ్యాపారం, ఇటు సోషల్ మీడియాలో తనదైన నడక, వినూత్న పోకడలు, విమర్శలతో ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండే మస్క్.. ఇప్పుడు మరోసారి అగ్రరాజ్యం అమెరికాకు హాట్ టాపిక్ అయ్యారు. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వెంట నిలిచి గెలుపు దాకా తీసుకెళ్లిన ఎలాన్.. ఇప్పుడు రూటు మార్చారు. ట్రంప్ నిర్ణయాలపై తన టోను మార్చారు. ఏకంగా అమెరికాకు కొత్త పార్టీ అవసరాన్ని సృష్టించే దాకా వెళ్లారు.

అమెరికా(America) రాజకీయాల్లో విమర్శలు, అధికార ప్రతిపక్షాల మధ్య పోరు, తీవ్రమైన కామెంట్లు, ఆరోపణలు సర్వ సాధారణం. కానీ, ఎలాన్ మస్క్ మాత్రం ప్రత్యేకం. అగ్ర టెక్నాలజీ సంస్థలు టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్(Space X)తో పాటు సోషల్ మీడియా వేధిక ఎక్స్(గతంలో ట్విటర్) అధినేతగా ఉన్న ఎలాన్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇప్పుడు ట్రంప్‌ను ఎదిరించి ఆ కోటరీ నుంచి బయటికొచ్చిన ఎలాన్ కొత్త పార్టీ ప్రకటన కూడా అంతే ఊపందుకుందక్కడ.
ట్రంప్.. మస్క్.. చెరోరకం!
అమెరికాలో ట్రంప్, ఎలాన్ ఇద్దరూ దిగ్గజ వ్యాపారవేత్తలు. ఇద్దరిదీ ప్రత్యేక దారి. ఇటీవలి ఎన్నికల్లో ట్రంప్ వెన్నంటి నిలిచిన ఎలాన్ అతని తరఫున దేశమంతా ప్రచారం చేశారు. అక్కడ రిపబ్లికన్ల గెలుపులోనూ కీలక పాత్ర పోషించాడు. ట్రంప్ సైతం ఒప్పుకున్నాడీ మాట. అయితే, గత కొంత కాలంగా ట్రంప్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్, చైనాలాంటి దేశాలపై భారీగా దిగుమతి పన్నులు విధించడంతో పాటు అక్కడి విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నాడు ట్రంప్. వీసాల రద్దు, ఉద్యోగ అర్హతల మార్పు, వీసాల జారీలో కఠిన నియమాలు లాంటి అనేక దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. (Trump Musk)
ఈ మధ్యే భారత్ పాక్ యుద్ధంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రపంచ దేశాలన్నింటిపై టారిఫ్ వార్ ప్రకటించి విమర్శల పాలయ్యాడు. భారత్, చైనా ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. హార్వర్డ్ యూనివర్సిటీతో గొడవ మొదలుకుని అనేక విషయాల్లో తనదైన శైలిలో రెచ్చిపోతూ వస్తున్నాడు. దీనిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తగా.. ఎలాన్ ఈ విషయంపై తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. టారిఫ్ వార్‌పై వెనక్కి తగ్గాలని.. ఈ పన్నుల ప్రభావం అమెరికాను నాశనం చేస్తుందని హెచ్చరించాడు. అయితే, దీనిపై ఏమాత్రం వెనక్కి తగ్గని ట్రంప్ మొండి వైఖరి కొనసాగిస్తూ వచ్చాడు.
టెస్లా.. భారీ పతనం!
ఈ ఇద్దరి మధ్య విబేధాలు కాస్త రచ్చకెక్కాయి. ఇటీవలె ట్రంప్ గెలుపులో తనే కీలకమంటూ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశాడు. దానికి ఎవరి సాయం లేకున్నా గెలిచే వాన్నంటూ వైట్ హౌజ్ నుంచి ట్రంప్ బదులిచ్చాడు. ఈ వివాదం కాస్త పెరిగి, ట్రంప్ – మస్క్ కంపెనీలపై ఫెడరల్ కాంట్రాక్టులు రద్దు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడంతో కాంట్రవర్సీ వేగంగా ముదిరింది. దీనివల్ల టెస్లా షేర్లు ఒక్క రోజులో 14% వరకు పడిపోయాయి. ట్రంప్ మీడియా కంపెనీ కూడా మార్కెట్లో నష్టాలు చూసింది.

80శాతం మంది Yes!
విబేధాలు తారాస్థాయికి చేరనున్నాయనే వార్తల నడుమ.. మరోసారి ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో అమెరికాకు ఇప్పుడు మరో రాజకీయ పార్టీ అవసరం ఉందంటారా అంటూ యువ, మధ్యస్థ వయస్కులను ప్రశ్నించాడు. అయితే, దీనికి 80శాతం మంది నెటిజన్లు మద్దతు తెలిపారు. ఎక్స్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే స్థాయిలో అమెరికన్లు కొత్త పార్టీని కోరుకోవడం అక్కడ సంచలనం రేకెత్తించింది.
ఇదిలా ఉండగా.. తన కొత్త పార్టీ వాదనలకు బలం చేకూర్చుతూ ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం తన ఖాతాల్లో ది అమెరికా పార్టీ.. అనే పేరును ఉటంకిస్తూ.. అమెరికా ప్రజలు మాట్లాడారు.. దాదాపు 56 లక్షల మంది ఓటింగ్‌లో 80శాతం మందికి కొత్త పార్టీ అవసరం ఉందంటూ పోస్ట్ పెట్టారు.
రాజకీయ వ్యవస్థపై మస్క్ విమర్శలు
ఇప్పటికే డెమొక్రాట్స్, రిపబ్లికన్స్ అనే రెండు పార్టీల ఆధిపత్యంతో అమెరికాలో ప్రజల గొంతు వినిపించట్లేదన్నారు. మధ్యస్థులు, సాధారణ పౌరుల కోసం కచ్చితంగా ఓ నూతన రాజకీయ వేధిక అవసరముందని స్పష్టం చేశారు. ఇది ప్రజల గొంతుకగా ఉండటంతో పాటు పెత్తందరీ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడుతుందన్నారు. అంతేకాదు, “ఇది పార్టీ కాదు.. ప్రజల శక్తి” అంటూ మస్క్ పేర్కొనడం గమనార్హం.
అమెరికాలో మూడో పార్టీ సాధ్యమేనా..?
అమెరికాలో “తృతీయ పార్టీ”లు ఏర్పడటం కొత్త కాదు. కానీ అవి ఎక్కువ కాలం నిలబడలేవు. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నయంగా ముందుకొచ్చిన లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ వంటివి అక్కడ ప్రభావం చూపట్లేదు. బలమైన పోటీ ఇవ్వకపోగా.. ఒకటి రెండు స్థానాలతో సరిపెట్టుకుంటున్నాయి. ఇప్పుడు మస్క్ పార్టీకి మద్దతు ప్రజల మద్దతు ఏమేరకు ఉండనుంది.. యువత ఎటువైపు నిలబడతారనేది కీలకంగా మారనుంది. ఎలాన్ మస్క్ కు అభిమానులెందరో, వ్యతిరేకలూ అంతకు రెట్టింపు ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. దీని ప్రభావమే అక్కడి రాజకీయాల్ని మార్చనుంది.