
Tollywood: జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ వార్త మీడియా సృష్టించినదేనని ప్రముఖ నిర్మాత, తెలంగాణా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు(Dil Raju) స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan)ను నలుగురు నిర్మాతలు టార్గెట్ చేశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. ప్రభుత్వానికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని.. దానివల్లే ఈ పరిణామాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు.
ఈ గందరగోళమంతా తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలో మొదలైందన్నారు దిల్ రాజు. అక్కడే థియేటర్ల బందుకు బీజం పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) సర్కారులో టాలీవుడ్ నిర్మాతలు భయపడుకుంటూ బతికారంటూ వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు.. ఈ ప్రభుత్వంలో మాకు అందుతున్న మద్దతు మామూలుది కాదన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే అందరం కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్‌ని కలిశామని.. ఆయన వల్లే ఇప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం సులభమైందన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పలు మీడియా ఛానళ్లపై ఆయన మండిపడ్డారు.